జూనియర్లకు గుండు కొట్టిన సీనియర్లు.. మెడికల్ కాలేజీలో ర్యాగింగ్
- భయపడి ఇంటికి వెళ్లిపోయిన జూనియర్ విద్యార్థులు
- రామగుండం మెడికల్ కాలేజీలో ఉద్రిక్తత
- వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు విద్యార్థుల ఆందోళన
రామగుండం మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతూ, కాలేజీ అనుబంధంగా ఉన్న హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు విద్యార్థుల గదుల్లోకి సోమవారం రాత్రి సీనియర్లు మూకుమ్మడిగా చొరబడ్డారు. జూనియర్లను ప్రశ్నలతో వేధిస్తూ జుట్టు అంతలా ఎందుకు పెంచారని నిలదీశారు. అనంతరం ట్రిమ్మర్ తో గుండు చేసి, మీసాలు కూడా తొలగించారు. వారితో పాటు మరో ముగ్గురు విద్యార్థులను కూడా ర్యాగింగ్ చేశారు. ఈ విషయాన్ని ఫోన్ లో తమ తల్లిదండ్రులకు వివరించిన బాధిత స్టూడెంట్లు.. ఉదయాన్నే ఇంటికి వెళ్లిపోయారు. కాగా, ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేస్తున్న ఆగడాలతో విసిగిపోయిన జూనియర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసి కాలేజీకి వెళ్లిన గోదావరిఖని పోలీసులు.. ర్యాగింగ్ ఘటనపై జూనియర్లను విచారించారు. దీనిపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వివరించారు.