కేసీఆర్ చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదు: కడియం శ్రీహరి
- ఛలో నల్గొండ బహిరంగ సభకు బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి
- నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా అడ్డుకుంటోందన్న కడియం
- కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శ
నదీ జలాల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు నల్గొండ జిల్లాలో బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ బహిరంగసభకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం అబద్ధాలను ప్రచారం చేసిందని, కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగించడం మంచిది కాదని, దానివల్ల తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. కరెంటుకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం బీఆర్ఎస్‌పై ఉందన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు నదీ జలాలపైనా, వాటిని కేంద్రానికి అప్పజెప్పితే వచ్చే నష్టాలపైనా సభలో వివరిస్తారన్నారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో దీనిని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.