ముఖేశ్ అంబానీ చేతికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్?

news of jio finance in talks with paytm payments bank doing rounds
ఆర్బీఐ ఆంక్షలతో సంక్షోభంలో పడ్డ పేటీఎం పేమెంట్స్ బ్యాంకును జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కంపెనీల మధ్య చర్చలు మొదలయ్యాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడగా పేటీఎం ఈ వార్తల్ని ఖండించింది. మరోవైపు, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు మాత్రం దూసుకుపోయాయి. సోమవారం ట్రేడింగ్‌లో జియో షేర్లు 16.25 శాతం పెరిగి రూ.295 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని నమోదు చేశాయి. 

ఫైనాన్షియల్ మార్కెట్లో విస్తరించాలని చూస్తున్న జియో.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను కొనుగోలు చేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జియో ఇన్సూరెన్స్ వ్యాపారంలో ప్రవేశించింది. జియో ఫైనాన్స్ లిమిటెడ్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్, జియో పేమెంట్ సొల్యూషన్స్, జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను కూడా జియో నిర్వహిస్తోంది. 

జియో పేమెంట్స్ బ్యాంక్ ప్రస్తుతం డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లను, బిల్ పేమెంట్ సర్వీసెస్‌లను నిర్వహిస్తోంది. డెబిట్ కార్డులు, జియో వాయిస్ బాక్స్‌ను కూడా ప్రవేశపెట్టింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారం కూడా జతకూడితే జియోకు ఈ రంగంలో మరింత విస్తరించే అవకాశం దక్కుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఇదిలా ఉంటే, ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడతామని పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగులతో ఆయన వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావట్లేదని తెలిపిన ఆయన.. పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
Go Back to Shorts
Jio
Paytm Payments bank
Vijay Sekhar Sharma
Mukesh Ambani

More Telugu News