అమెజాన్‌లో ఉద్యోగం వచ్చిందని పార్టీ చేసుకుని వస్తూ ఢీకొట్టారు.. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాద ఘటనలో ఐదుగురి అరెస్ట్! 

Jubilee Hills Road Accident Accused Arrested
  • మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టిన నిందితులు
  • సికింద్రాబాద్‌లో మద్యం కొని కారులోనే తాగుతూ పలు ప్రాంతాల్లో తిరిగిన నిందితులు
  • చివర్లో అమెజాన్ కార్యాలయానికి వెళ్లి వస్తూ తెల్లవారుజామున ప్రమాదం
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు
మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమైన నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను తుకారంగేట్‌కు చెందిన కొవ్వూరి రుత్విక్‌రెడ్డి (21), లాలాపేటకు చెందిన లోకేశ్వరరావు (21), మౌలాలికి చెందిన బి.అభిలాష్ (20), వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన మగ్దంపల్లి అనికేత్ (22), సికింద్రాబాద్‌కు చెందిన వైష్ణవి (23)గా గుర్తించారు. ఫిరోజ్‌గూడకు చెందిన రుత్విక్‌రెడ్డి బంధువు జి.సురేశ్‌రెడ్డి (27) పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. 

ఆ రోజు ఏం జరిగిందంటే..
రుత్విక్‌రెడ్డికి ఇటీవల అమెజాన్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ ఆనందంలో పార్టీ ఇస్తానని స్నేహితులను పిలిచి తన సోదరి కారులో బయలుదేరాడు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్‌లో మద్యం కొన్నారు. రుత్విక్‌తోపాటు మరొకరు మద్యం తాగుతూనే కారులో పలు ప్రాంతాలు తిరిగారు. చివర్లో అమెజాన్ కార్యాలయం వద్దకువెళ్లి తెల్లవారుజామున 4 గంటల సమయంలో మాదాపూర్‌లో బిర్యానీ తిన్నారు. రుత్విక్‌రెడ్డి వేగంగా కారు నడుపుతూ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36/10 వద్ద అదుపు తప్పి.. బైక్‌పై స్నేహితుడు ఏసురాతో కలిసి బైక్‌పై వెళ్తున్న గాంధీనగర్‌కు చెందిన బౌన్సర్ లింగాల తారకరామ్ (30)ని ఢీకొట్టారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందగా, ఏసురాజు తీవ్రంగా గాయపడ్డాడు.

మళ్లీ ప్రమాద స్థలానికి  
తారకరామ్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన నిందితులు అదే వేగంతో బీహెచ్ఈఎల్ వెళ్లారు. అనంతరం ఫిరోజ్‌గూడ వచ్చి కారును అక్కడే వదిలేసి సురేశ్‌రెడ్డి కారులో మళ్లీ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడ తారకరామ్ మృతదేహం, పోలీసులు ఉండడం చూసి అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.  సీసీటీవీ కెమెరాలో నిందితుల కారును గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న సురేశ్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు.
Advertisement
Jubilee Hills Road Accident
Amazon
Hyderabad
Road Accident

More Telugu News