చైనాలో భారీ భూకంపం.. 111 మందికి పైగా మృత్యువాత
- గన్సు ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేలుపై 5.9 గా నమోదైన భూకంప తీవ్రత
- పెద్ద సంఖ్యలో కూలిపోయిన ఇళ్లు, భవనాలు
- మంగళవారం ఉదయం నుంచే మొదలైన రెస్క్యూ ఆపరేషన్ చర్యలు
ఈ భూకంపం కారణంగా పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయానని, గణనీయమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందని చైనా వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారని ప్రస్తావించింది. కాగా ఈ ప్రకృతి విపత్తుపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. భూకంప ప్రాంతాల్లో అన్ని విధాల సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాణాలతో బయటపడ్డవారిని సహాయక శిబిరాలకు తరలించాలని, వారి ఆస్తులకు రక్షణ కూడా కల్పించాలని ఆదేశించారు.
కాగా 5.9 తీవ్రత గల ఈ భూకంపం కేంద్రం గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్‌జౌకి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో గుర్తించామని, కింగ్‌హై ప్రావిన్స్ సరిహద్దుకు సమీపంలో సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా చైనాలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. ఆగస్టులో తూర్పు చైనాలో 5.4 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ప్రాణనష్టం తక్కువగానే ఉన్నప్పటికి పెద్ద సంఖ్యలో భవనాలు కూలాయి. ఇక సెప్టెంబర్ 2022లో సిచువాన్ ప్రావిన్స్‌లో 6.6 తీవ్రతతో సంభవించినప్పుడు సుమారు 100 మంది మృత్యువాతపడ్డారు. 2008లో ఏకంగా 7.9 తీవ్రతతో భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 5,335 మంది పాఠశాల విద్యార్థులు సహా మొత్తం 87,000 మంది ప్రాణాలు కోల్పోయారు.