ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ తరలింపు?
- సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం
- అధికారులతో సమావేశమై నేడు తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్
- ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తుండడంతో క్యాంప్ ఆఫీస్‌ను మార్చాలనుకుంటున్న రేవంత్ సర్కారు
ఎంసీఆర్హెచ్ఆర్డీలో గుట్ట మీద ఉన్న బ్లాక్‌లోకి మార్చాలని, ఈ మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. సోమవారం ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ, ప్రభుత్వ ఉన్నతాధికారులతో భేటీ తర్వాత సీఎం క్యాంపు ఆఫీస్ తరలింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీని సందర్శించారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.
సీఎం నివాసానికి మరింత దగ్గర
సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి తరలిస్తే రేవంత్ రెడ్డి నివాసానికి చాలా దగ్గర అవనుంది. సీఎం నివాసం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు ఆయన వెళ్తున్నారు. ఒకవేళ ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీకి క్యాంప్ ఆఫీస్‌ను మార్చితే దూరం చాలా వరకు తగ్గనుంది. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో అక్కడ తగిన వసతులు కూడా ఉన్నాయి. దీంతో అక్కడ ఏర్పాటు చేస్తే అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.