ఆరేళ్ల బాబుకు హార్ట్ ఎటాక్.. ఢిల్లీ ఆసుపత్రిలో మృతి
- కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న బాలుడు
- ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకున్న వైనం
- కొన్నాళ్లకే మరోమారు క్షీణించిన బాలుడి ఆరోగ్యం
చికిత్సతో కోలుకున్నట్లే కోలుకున్న బాలుడు.. తర్వాత మరోమారు జబ్బుబారిన పడ్డాడు. ఈసారి ఆసుపత్రిలో చేరి ఇంటికి తిరిగిరాలేదు. ఆ బాలుడి మరణానికి కారణం గుండెపోటేనని వైద్యులు నిర్ధారించారు. రక్త పరీక్షలో బాబు మయోకార్డిటిస్ వైరస్ బారిన పడినట్లు తేలిందన్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన బిజినెస్ మ్యాన్ రాహుల్ జైన్ కు ఒక్కడే కొడుకు.. ఆరేళ్ల విహాన్ జైన్ ఇండోర్ లోని ఓ కార్పొరేట్ స్కూలులో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇటీవల విహాన్ అనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించడంతో కోలుకున్నాడు.
ఈ క్రమంలో ఫ్యామిలీ ఫంక్షన్ కోసం రాహుల్ తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లాడు. అక్కడ మరోసారి విహాన్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బాలుడిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ విహాన్ శనివారం రాత్రి గుండెపోటుకు గురై చనిపోయాడు. వైద్య పరీక్షల్లో విహాన్ కు మయోకార్డిటిస్ అనే వైరస్ సోకినట్లు గుర్తించామని డాక్టర్లు చెప్పారు. ఈ వైరస్ గుండె కండరాలపై ప్రభావం చూపుతుందని, కండరాల వాపునకు కారణమవుతుందని వివరించారు. దీంతో గుండెకు రక్తం సరఫరాలో అవాంతరాలు ఎదురవుతాయని, ఫలితంగా గుండె అకస్మాత్తుగా ఆగిపోతుందని డాక్టర్లు చెప్పారు.