KCR: కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అన్యాయం జరిగితే ఒక్క కాంగ్రెస్ నేత కూడా మాట్లాడలేదు: కేసీఆర్

KCR lashes out at Congress leaders in Jogipet meeting
  • తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని గుర్తు చేసిన కేసీఆర్
  • కిరణ్ రెడ్డి మాటలను వ్యతిరేకిస్తూ ఒక్క కాంగ్రెస్ నేత రాజీనామా చేయలేదన్న సీఎం
  • దామోదర రాజనర్సింహా ముసిముసి నవ్వులు నవ్వారని ఆగ్రహం
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, కానీ నాడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. జోగిపేటలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వనని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని, కానీ ఆయన మాటలను వ్యతిరేకిస్తూ ఒక్క కాంగ్రెస్ పార్టీ నేత కూడా రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. పైగా ఆ సభలో ఉన్న దామోదర రాజనర్సింహా ముసిముసి నవ్వులు నవ్వారని అన్నారు. తెలంగాణ ప్రాంతం నష్టపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇక్కడి వారికి సింగూరు నీళ్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. దామోదర రాజనర్సింహ దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతుబంధు వృథా అని మట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు మళ్లీ ఒక్కసారి అవకాశం అని అడుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసివేసి, భూమాత అని పెడుతారట.. అది భూమాతనా.? భూమేతనా..? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలకు ఢిల్లీ, హైదరాబాద్‌కి తిరగడానికే సరిపోతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి రాజ్యమేనని, అలాంటి ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి? అన్నారు. ధరణి అనేది రైతులకు శ్రీరామ రక్ష లాంటిదన్నారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ప్రజలకు తెలుసునని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకున్నామని వ్యాఖ్యానించారు.
KCR
Telangana Assembly Election
BRS

More Telugu News