Firefox: ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో లోపాలు... వెంటనే అప్ డేట్ చేసుకోవాలన్న కేంద్రం

CERT warns users to update Firefox browser immediately
  • ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో బగ్స్ గుర్తించిన సీఈఆర్టీ.ఇన్
  • 120.0 కంటే ముందు వెర్షన్ లో లోపాలు
  • హ్యాకర్లు విజృంభించే అవకాశం ఉంటుందని కేంద్రం వెల్లడి 
చాలామంది ఇంటర్నెట్ యూజర్లు గూగుల్ క్రోమ్ కు ప్రత్యామ్నాయంగా పాటు మొజిల్లా ఫైర్ ఫాక్స్ ను కూడా వినియోగిస్తుంటారు. అయితే, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కొన్ని లోపాలు ఉన్నాయని, వెంటనే అప్ డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఫైర్ ఫాక్స్ 120.0 కంటే ముందు వెర్షన్ ఉపయోగిస్తున్న వారికి ఈ హెచ్చరిక వర్తిస్తుందని తెలిపింది. 

కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ.ఇన్) ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో బగ్స్ ఉన్నట్టు గుర్తించింది. ఫైర్ ఫాక్స్ లోని ఈ లోపాల కారణంగా హ్యాకర్లు బ్రౌజర్ లోకి ఆర్బిటరీ కోడ్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని, తద్వారా వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉంటుందని సీఈఆర్టీ.ఇన్ తెలిపింది. యూజర్ల ఫోన్లు, కంప్యూటర్లలో హ్యాకర్లు నిషేధిత వెబ్ సైట్లను, పోర్టళ్లను తెరిచే అవకాశం ఉంటుందని వివరించింది. 

అంతేకాదు, యూజర్లు తరచుగా సందర్శించే వెబ్ సైట్ల సెక్యూరిటీ వ్యవస్థలను ఛేదించుకుని వాటిలో మాల్వేర్లను చొప్పించే ముప్పు ఉంటుందని సీఈఆర్టీ.ఇన్ వెల్లడించింది. ఫైర్ ఫాక్స్ ను అప్ డేట్ చేసుకోవడమే ఉత్తమ మార్గమని స్పష్టం చేసింది. 

ఫైర్ ఫాక్స్ సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్రౌజర్ అప్ డేట్స్ సెక్షన్ ను ఓపెన్ చేస్తే... బ్రౌజర్ వెర్షన్ ఏంటనేది తెలుస్తుందని...120.0 కంటే ముందు వెర్షన్ అయితే వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.
Firefox
Browser
Bugs
CERT.IN
India

More Telugu News