సీఎంను కలవొద్దన్నప్పుడు జనం మీకు ఓటు వేయాల్సిన అవసరం ఏముంది?: కేటీఆర్‌కు షర్మిల ప్రశ్న
- ఓట్లు వేసి గెలిపించింది సేవ చేయడానికా? గడీల్లో భోగాలు అనుభవించడానికా? అని నిలదీత
- ఓట్లేసిన పాపానికి జనాలకు కష్టాలు.. దొరకు ఫామ్ హౌజ్ వైభోగాలు అని మండిపాటు
- ముమ్మాటికి వారు తెలంగాణ ద్రోహులేనని తీవ్ర విమర్శలు
- కేసీఆర్ అంతటి అహంకార ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ లేరన్న షర్మిల
ఓట్లేసిన పాపానికి జనాలకు కష్టాలు.. దొరకు ఫామ్ హౌజ్ వైభోగాలు అని ఎద్దేవా చేశారు. అధికారం మత్తులో వారికి ప్రజాసమస్యలు కనిపించడం లేదన్నారు. ఇళ్లు లేక పేదలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా మీకు కనబడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి సమస్యలపై రైతుల గోడు వినిపించదు.. ఉద్యోగాలు కావాలని మొత్తుకుంటున్న నిరుద్యోగుల ఆకలి కేకలు మీ చెవిన పట్టవు.. సర్కారు బడిలో వసతులు లేక పేద బిడ్డలు పడుతున్న బాధలు మీకు కానరావంటూ చురకలు అంటించారు. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని సమస్యల సుడిగుండంలో ముంచారన్నారు. మీ పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు, కన్నీళ్లే.. ముమ్మాటికి మీరు తెలంగాణ ద్రోహులేనని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అంతటి అహంకార ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ లేరన్నారు.