APSRTC: బస్సుకు అడ్డంగా బైక్.. తీయాలని హారన్ కొట్టిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సును వెంబడించి డ్రైవర్‌పై విచక్షణ రహితంగా దాడి

APS RTC Bus Driver Was Attacked By Goons
షార్ట్స్‌లో చూడండి
బస్సుకు అడ్డంగా ఉన్న బైక్‌ను తీయాలంటూ హారన్ కొట్టిన ఆర్టీసీ డ్రైవర్‌ను కొందరు దుండగులు బస్సు నుంచి కిందికి లాగి దాడిచేశారు. రోడ్డుపై పడేసి కాలితో తన్నుతూ నానా రభస చేశారు. నడిరోడ్డుపై ఇంత దారుణం జరుగుతున్నా అందరూ చోద్యం చూస్తూ వీడియోలు తీశారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.  

పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం సాయంత్రం కావలి నుంచి బయలుదేరింది. ట్రంకు రోడ్డు మీదుగా వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఓ బైక్ అడ్డంగా కనిపించింది. దీంతో బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ బైక్‌ను పక్కకు జరపాలంటూ హారన్ మోగించాడు. మరోవైపు, వెనక వాహనాలు జామ్ కావడం, అక్కడే పోలీసులు ఉండడంతో బైక్ యజమాని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

అలా వెళ్లిన అతడు తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. మొత్తం 14 మంది కారులో వచ్చి ఆర్టీసీ బస్సును వెంబడించారు. ఓ చోట బస్సును అడ్డుకుని డ్రైవర్‌ను కిందికి దింపి విచక్షణ రహితంగా దాడిచేశారు. రోడ్డుపై పడేసి కడుపులో తన్నుతూ, పిడిగుద్దులు కురిపిస్తూ చెలరేగిపోయారు. డ్రైవర్ తనను వదిలేయాలని వేడుకున్నా కనికరించలేదు సరికదా, మరింత రెచ్చిపోయారు. చుట్టూ ఉన్నవారు చోద్యం చూస్తూ వీడియోలు తీశారు తప్పితే అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. 

చివరికి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. నిందితులు దేవరకొండ సుధీర్, శివారెడ్డి, మల్లి, విల్సన్, కిరణ్ సహా 10 మందిపై హత్యాయత్నంపై సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులపై ఇప్పటికే పలు నేరారోపణలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. వారి కఠిన చర్యలు ఉంటాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

Go Back to Shorts
APSRTC
Bus Driver
Attack On Bus Driver
Nellore
Kavali

More Telugu News