Lambasingi: లంబసింగిలో మేఘాల కితకితలు.. పర్యాటకుల సందడి..

Thick fog envelops Vanjangi Lambasingi
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో పర్యాటక ప్రాంతాలు సందడిగా మారాయి. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మంచు మేఘాలు ఆ ప్రాంతాలను అందంగా మార్చేశాయి. దసరా సెలవులు కావడంతో పర్యాటకుల రాక కూడా ఎక్కువగానే ఉంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. గత ఆదివారంతో పోలిస్తే 8 డిగ్రీలు తక్కువగా 16 డిగ్రీలు, అంతకంటే తక్కువకు పడిపోయాయి. దట్టమైన మేఘాలు ఏజెన్సీ పల్లె ప్రాంతాలపై దుప్పటి మాదిరిగా పరుచుకున్నాయి.

వనజంగి వ్యూ పాయింట్, లంబసింగి ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. వనజంగి వ్యూపాయింట్ నుంచి కిందకు చూసినప్పుడు ఆ ప్రాంతమంతా మేఘాల దుప్పటి పరుచుకున్నట్టు వాతావరణం కనిపిస్తోంది. వనజంగిలో 30 ప్రైవేటు కాటేజీలు ఉండగా, అన్నీ పర్యాటకలతో నిండిపోయాయి. లంబసింగిలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి విభాగానికి చెందిన 15 కాటేజీలు ఉన్నాయి. 100కు పైగా ప్రైవేటు కాటేజీలు ఉన్నాయి. ఇవన్నీ పర్యాటకులతో పూర్తిగా నిండిపోయినట్టు వాటి నిర్వాహకులు తెలిపారు. 

ఏటా నవంబర్ లో కనిపించే వాతావరణం ఈ ఏడాది ముందుగానే వచ్చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా మంగళవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా తగ్గిపోయింది. వనజంగి ప్రాంతానికి రోజూ 5,000 మంది వరకు పర్యాటకులు వస్తున్నారు. రాత్రికి కాటేజీల్లో బస చేసి ఉదయమే సూర్యోదయం చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సముద్ర మట్టానికి వనజంగి ప్రాంతం 3,400 అడుగుల ఎత్తులో ఉంది. విశాఖపట్నం నుంచి 3 గంటలు ప్రయాణిస్తే (100 కిలోమీటర్లు) ఇక్కడకు చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి పాడేరు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బొర్రా గుహల వద్ద కూడా సందడి నెలకొంది. మంగళవారం 4,000 మంది దర్శించారు.
Go Back to Shorts
Lambasingi
paderu
Vanjangi
Thick fog
tourists

More Telugu News