టీమిండియా డ్రెస్సింగ్‌ రూంలో సూపర్ సీన్.. కింగ్ కోహ్లీలో ఆకాశాన్నంటిన సంబరం

Virat Kohlis Priceless Reaction After KL Rahul Wins Best Fielder Award vs Pakistan
  • పాక్‌పై వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ చిరస్మరణీయ విజయం 
  • విజయం అనంతరం డ్రెస్సింగ్‌ రూంలో ఫీల్డర్లపై కోచ్ ప్రశంసలు
  • ఇమామ్-ఉల్-హక్ క్యాచ్ పట్టిన కేఎల్ రాహుల్‌కు బెస్ట్ ఫీల్డర్ అవార్డు
  • టీవీ స్క్రీన్‌పై రాహుల్ క్యాచ్ చూసి కోహ్లీలో పట్టరాని ఆనందం
అహ్మదాబాద్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌‌పై భారత్ చిరస్మరణీయ విజయం అందుకుంది. తూటా పేల్చకుండానే యుద్ధం ముగించినట్టు చాలా సులువుగా గెలుపు సొంతం చేసుకుంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో టీమిండియా క్రికెటర్లు రాణించడంతో గెలుపు నల్లేరు మీద నడకే అయ్యింది. 

ఇక మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూంలో టీమిండియా సభ్యుల్లో విజయోత్సాహం కట్టలు తెంచుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి క్రీడాకారుడిపైనా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ప్రశంసలు కురిపించాడు. ఆ సందర్భంగా ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సిరాజ్, కుల్దీప్, శార్దూల్, జస్‌ప్రీత్ మైదానంలో చురుగ్గా కదులుతూ గొప్పగా ఫీల్డింగ్ చేశారని అన్నారు. మ్యాచ్‌లో కీలకమైన ఇమామ్-ఉల్-హక్ క్యాచ్‌ పట్టిన కేఎల్ రాహుల్‌కు బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఇచ్చాడు. 

ఈ సందర్భంగా టీవీపై కేఎల్ రాహుల్ పట్టిన క్యాచ్ తాలుకు వీడియోను మరోసారి ప్లే చేయడంతో ఆ దృశ్యం చూసి విరాట్ కోహ్లీ ఎగిరి గంతేశాడు. అతడిలో సంతోషం ఉప్పొంగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా, గత మ్యాచ్‌లో ఇలాగే బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్న శార్దూల్ ఠాకూర్, కేఎల్ రాహుల్ మెడలో పతకం వేసి శుభాకాంక్షలు తెలిపాడు.  
Go Back to Shorts
KL Rahul
Virat Kohli
BCCI

More Telugu News