Daniil Medvedev: యూఎస్ ఓపెన్: వరల్డ్ నెంబర్ వన్ అల్కరాజ్ కు షాకిచ్చిన మెద్వెదెవ్

Daniil Medvedev defeats world number one Carlos Alcaraz in US Open semis
షార్ట్స్‌లో చూడండి
వరల్డ్ నెంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్ సమరంలో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్... అల్కరాజ్ కు షాకిచ్చాడు. 

హోరాహోరీగా సాగిన పోరులో మూడో సీడ్ మెద్వెదెవ్ నమ్మశక్యం కాని ఆటతీరుతో స్పెయిన్ యువకెరటం అల్కరాజ్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. 7-6, 6-1, 3-6, 6-3తో మెద్వదెవ్ జయకేతనం ఎగురవేశాడు. తద్వారా యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 

ఈ మ్యాచ్ లో మెద్వెదెవ్ ఆటతీరు మరోస్థాయిలో ఉందంటే అతిశయోక్తి కాదు. బలంగా కనిపించే అల్కరాజ్ తో పోల్చితే బక్కపల్చగా ఉండే ఈ రష్యన్ ఆటగాడు పదునైన సర్వీసులతో ఆకట్టుకున్నాడు. బ్రేక్ పాయింట్లు గెలవడంలో ఒడుపు చూపించిన మెద్వెదెవ్ కీలక సమయాల్లో అల్కరాజ్ ను నిలువరించి తొలి రెండు సెట్లను ఖాతాలో వేసుకున్నాడు. 

అయితే మూడో సెట్ లో అల్కరాజ్ పుంజుకుని ఆ సెట్ ను 6-3తో చేజిక్కించుకున్నాడు. కానీ ఆ ఊపు తాత్కాలికమే అయింది. నాలుగో సెట్ ను మెద్వెదెవ్ 6-3తో గెలుచుకుని, తద్వారా అల్కరాజ్ కు కళ్లెం వేశాడు. 

ఇక, సోమవారం జరిగే ఫైనల్లో మెద్వెదెవ్... నెంబర్ 2 సీడ్ నొవాక్ జకోవిచ్ ను ఢీకొంటాడు. అర్ధరాత్రి జరిగిన మరో సెమీస్ లో జకోవిచ్ 6-3, 6-2, 7-6తో అమెరికా యువ ఆటగాడు బెన్ షెల్టన్ పై అలవోకగా నెగ్గాడు.
Go Back to Shorts
Daniil Medvedev
Carlos Alcaraz
Semis
US Open

More Telugu News