Karnataka: మూడున్నర ఏళ్ల బాలుడి సాహసం.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కన్నా ఎత్తయిన ప్రాంతానికి చేరి, రికార్డు!

Karnataka kid reaches umlingla pass becomes the youngest to do so
  • 19,024 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్ లా పాస్‌కు చేరుకున్న కర్ణాటక చిన్నారి
  • తల్లితండ్రుల సాయంతో సరికొత్త రికార్డు నెలకొల్పిన వైనం
  • గతంలో గురుగ్రామ్‌కు చెందిన ఏడున్నరేళ్ల బాలుడి పేరిట ఉన్న రికార్డు ఛేదించిన చిన్నారి 
కర్ణాటకకు చెందిన మూడున్నర ఏళ్ల బాలుడు అరుదైన రికార్డు సృష్టించాడు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కన్నా ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ఉమ్లింగ్ లా పాస్(19,024) చేరుకున్న అతిపిన్న వయస్కుడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తన తల్లిదండ్రుల సాయంతో చిన్నారి ఈ ఘనత సాధించాడు. 

దక్షిణ కన్నడ జిల్లా సూలియాకు చెందిన జజీల్ రెహ్మాన్ తన తల్లిదండ్రులు తౌహీద్ రెహ్మాన్, జష్మియాలతో కలిసి ఆగస్టు 15న బైక్‌పై బయలుదేరాడు. ఆ ముగ్గురూ 19 రోజుల పాటు దాదాపు 5 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఉమ్లింగ్ లా పాస్‌కు చేరుకున్నారు. అక్కడ వారు గత శనివారం జాతీయ జెండాతో పాటూ కర్ణాటక జెండా, తుళునాడు పతకాలను ఆవిష్కరించారు. 

ఎంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఆ చిన్నారి ఉమ్లింగ్ లా చేరుకున్న అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ ప్రాంతం భౌగోళికంగా ఎంతో సంక్లిష్టమైనది. ఇక్కడ చిషుమ్లే నుంచి దెమ్‌చౌక్ వరకూ ఉండే 52 కిలోమీటర్ల రోడ్డు మార్గం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారిగా పేరుగాంచింది. ఇంత ఎత్తున ఉండటంతో ఈ ప్రాంతంలో గాలిలోని ఆక్సిజన్ స్థాయి సాధారణ పరిస్థితులతో పోలిస్తే 43 శాతంగా ఉంటుంది. కాగా, గురుగ్రామ్‌కు చెందిన ఏడున్నరేళ్ల బాలుడు గతంలో ఉమ్లింగ్ లా చేరుకుని నెలకొల్పిన రికార్డును తాజాగా జజీల్ రెహ్మాన్ బద్దలు కొట్టాడు.
Karnataka
Umlingla pass
Himalayas

More Telugu News