Sandhya Reddy: ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ అరుదైన ఘనత.. డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవ ఎన్నిక

Telangana woman sandhyareddy unanimously elected deputy mayor of strouthfield
  • సిడ్నీలోని స్ట్రాత్‌ఫీల్డ్ పురపాలక సంఘం డిప్యూటీ మేయర్‌గా హైదరాబాదీ మహిళ సంధ్యా రెడ్డి
  • ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు మహిళగా అరుదైన ఘనత
  • 2021 నాటి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పురపాలక సభ్యురాలిగా గెలుపు
  • స్థానికంగా విస్తృతస్థాయిలో సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గొప్ప గుర్తింపు
  • ఆమె చొరవతోనే స్థానికంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహం ఏర్పాటు
  • తనకీ గౌరవం దక్కడంపై సంధ్యా రెడ్డి హర్షం
ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ కర్రి సంధ్యా రెడ్డి(శాండీ రెడ్డి) అరుదైన ఘనత సాధించారు. న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రం సిడ్నీ నగరంలోని స్ట్రాత్‌ఫీల్డ్ పురపాలక సంఘం డిప్యూటీ మేయర్‌గా ఆమె ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి మహిళగా, తొలి తెలుగు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 

సంధ్యా రెడ్డి తల్లిదండ్రులు శంకర్ రెడ్డి, సారా రెడ్డి. హైదరాబాద్‌లో స్టాన్లీ కళాశాలలో ఇంటర్‌మీడియట్ వరకూ చదువుకున్న సంధ్యా రెడ్డి ఆపై కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద పట్టా పొందారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేశారు. 1991లో కర్రి బుచ్చిరెడ్డి అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో ఆమె వివాహం జరిగింది. ఆ తరువాత సంధ్య భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. 

అక్కడ ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంలో మైగ్రేషన్ లా డిగ్రీ పొందిన ఆమె ఇమిగ్రేషన్ న్యాయవాదిగా పనిచేశారు. మరోవైపు భర్తతో కలిసి స్ట్రాత్‌ఫీల్డ్‌లో విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆమె విశేష కృషి ఫలితంగా స్ట్రాత్‌ఫీల్డ్‌లోని హోమ్‌బుష్ కమ్యూనిటీ సెంటర్‌లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహం ఏర్పాటైంది. తన సేవలకు గుర్తింపుగా ఆమెకు 2020లో ఉత్తమ పౌరురాలి పురస్కారం కూడా లభించింది. 

కాగా, 2021 ఆమె ఉంటున్న స్ట్రాత్‌ఫీల్డ్‌లో పురపాలక సంఘానికి ఎన్నికలు జరిగాయి. అక్కడి ప్రవాస భారతీయులు, ఇతర స్థానికుల ప్రోత్సాహంతో ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన ఆమె లేబర్, లిబరల్ పార్టీల అభ్యర్థులపై ఘన విజయం సాధించారు. తాజాగా పురపాలక సంఘంలోని మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు జరిగిన ఎన్నికలలో ఆమె ఏకగ్రీవంగా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 

తనకు ఈ అరుదైన అవకాశం దక్కడంపై సంధ్యా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సంధ్యా రెడ్డికి నీల్, నిఖిల్ రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నిఖిల్ రెడ్డి ఈ ఏడాది ఆస్ట్రేలియా జాతీయ చదరంగం ఛాంపియన్‌గా నిలిచాడు.
Sandhya Reddy
Australia
Sydney

More Telugu News