భారీ వర్షాల వేళ రాచకొండ పోలీసుల సూచనలు.. వీడియో ట్వీట్
- పిల్లల విషయంలో జాగ్రత్తలు చెప్పిన పోలీసులు
- వరద నీటిలో ఆడుకునేందుకు పంపవద్దని సూచన
- విద్యుత్ పరికరాలకు వారిని దూరంగా ఉంచాలని హెచ్చరిక
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని రాచకొండ పోలీసులు ప్రజలకు సూచించారు. నీటి ప్రవాహాలను దాటేందుకు ప్రయత్నించవద్దని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, కిందపడ్డ కరెంట్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పాత గోడలకు దగ్గర్లో, చెట్ల కింద నిలబడ వద్దని చెప్పారు. అత్యవసర సందర్భాలలో బయటకు వస్తే రోజూ మీరు వెళ్లే దారిలోనే వెళ్లాలని, దగ్గరనో మరే కారణంతోనో కొత్తదారిలో వెళ్లొద్దని హెచ్చరించారు. రోజూ వెళ్లే తోవలో ఎక్కడ ఏం ఉంటుందనేది తెలిసి ఉంటుంది కాబట్టి ప్రమాదాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని తెలిపారు. అత్యవసర సందర్భాలలో సాయం కోసం డయల్ 100 కు ఫోన్ చేయాలని సూచించారు.