Chalo Vijayawada: ఈ నెల 17న విద్యుత్ ఉద్యోగుల 'ఛలో విజయవాడ'... అనుమతి లేదంటున్న పోలీసులు

Vijayawada CP says no permission to electricity employees Chalo Vijayawada protest
  • ఇటీవల ప్రభుత్వంతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చర్చలు
  • పీఆర్సీకి ఆమోదం
  • అయితే, విద్యుత్ జేఏసీ నేతలు కుమ్మక్కయారంటున్న ఉద్యోగులు
  • జేఏసీ నుంచి బయటికి వచ్చిన పలు సంఘాలు
  • కొత్త కార్యాచరణ ప్రకటించిన పోరాట కమిటీ
ఇటీవల ఏపీ ప్రభుత్వంతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చర్చలు జరపగా, పీఆర్సీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే, ఈ పీఆర్సీని విద్యుత్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. పీఆర్సీ విషయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2.6 లక్షల గరిష్ఠ వేతన స్కేలు తమకు ఆమోదయోగ్యం కాదని అంటున్నారు. 

ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నుంచి ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘాలు బయటికి వచ్చి పోరాట కార్యాచరణకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో విద్యుత్ ఉద్యోగుల పోరాట కమిటీ ఆగస్టు 17న ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. 

అయితే, ఈ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగుల ఛలో విజయవాడకు అనుమతి లేని కారణంగా, ఈ కార్యక్రమానికి ఎవరైనా హాజరైతే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విజయవాడలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలు చేస్తామని, ఎస్మా చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 

విద్యుత్ సౌధ, బీఆర్టీఎస్ రోడ్ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉంటాయని కాంతిరాణా టాటా తెలిపారు. మూడు వేల మంది పోలీసులతో విజయవాడ వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగుల నేతలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని చెప్పారు.
Chalo Vijayawada
Electricity Employees
CP Kanti Rana Tata
Vidyut JAC
Andhra Pradesh

More Telugu News