ఫోర్బ్స్ సంపన్న మహిళల జాబితాలో నలుగురు భారతీయ అమెరికన్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫోర్బ్స్ సంపన్న మహిళల జాబితాలో నలుగురు భారతీయ అమెరికన్లు

Four Indian origin women placed in Forbes self made richest list
  • అమెరికాలో సంపన్న మహిళల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్
  • జాబితాలో జయశ్రీ ఉల్లాల్, నీరజా సేథీ, నేహా నార్ఖెడే, ఇంద్రనూయి
  • వరుసగా ఆరో ఏడాది కూడా అగ్రస్థానంలో డైనే హెండ్రిక్స్
భారతీయులు, భారత సంతతి వ్యక్తుల శక్తిసామర్థ్యాలు అంతర్జాతీయంగా ఎన్నోసార్లు నిరూపితమయ్యాయి. తాజాగా, ఫోర్బ్స్ ప్రకటించిన అమెరికా సంపన్న మహిళల జాబితాలో నలుగురు భారత సంతతి మహిళలు చోటు సంపాదించడం విశేషం. స్వశక్తితో ఎదిగిన అమెరికా టాప్-100 సంపన్న మహిళల జాబితాలో భారత సంతతికి చెందిన ఇంద్రనూయి, జయశ్రీ ఉల్లాల్, నీరజా సేథీ, నేహా నార్ఖెడే ఉన్నారు. 

అరిస్టా నెట్ వర్క్ కు ప్రెసిడెంట్, సీఈవోగా వ్యవహరిస్తున్న 62 ఏళ్ల జయశ్రీ ఉల్లాల్ ఫోర్బ్స్ జాబితాలో 15వ స్థానంలో నిలవడం విశేషం. ఉల్లాల్ నాయకత్వంలోని అరిస్టా నెట్ వర్క్ ట్రేడింగ్ కంపెనీ ఆదాయం గతేడాది 4.4 బిలియన్ డాలర్లు. క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ స్నో ఫ్లేక్ బోర్డ్ డైరెక్టర్ గానూ ఆమె కొనసాగుతున్నారు. 

ఇక నీరజా సేథీ (68) ఫోర్బ్స్ జాబితాలో 25వ స్థానంలో ఉన్నారు. భర్త భరత్ దేశాయ్ తో కలిసి ఆమె 1980లో సింటెల్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థను 2018లో ఫ్రెంచ్ ఐటీ సంస్థ అటోస్ ఎస్ఈ 3.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నీరజా సేథీ మొత్తం నికర ఆస్తి విలువ 990 మిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ పేర్కొంది. 

38 ఏళ్ల నేహా నార్ఖెడే విషయానికొస్తే... ఫోర్బ్స్ జాబితాలో 50వ స్థానం దక్కించుకున్నారు. ఆమె నికర ఆస్తి విలువ 520 మిలియన్ డాలర్లు. లింక్డ్ ఇన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఓపెన్ సోర్స్ మెసేజింగ్ వ్యవస్థ అపాచే కాఫ్కా రూపకల్పనలో పాలుపంచుకున్నారు. 2023లో నార్ఖెడే సొంతంగా ఆసిలార్ అనే సంస్థను ప్రారంభించారు. ఈ టెక్ కంపెనీకి ఆమె సహవ్యవస్థాపకురాలు, సీఈవో.

ఇక, ఇంద్రనూయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెప్సీకో సంస్థ మాజీ సీఈవో. 67 ఏళ్ల ఇంద్రనూయి 2019లో పదవీవిరమణ చేశారు. అనంతరం ఆమెజాన్ తో జట్టుకట్టారు. తాజా ఫోర్బ్స్ జాబితాలో ఆమె ర్యాంకు 77. ఇంద్రనూయి నికర ఆస్తి విలువను ఫోర్బ్స్ 350 మిలియన్ డాలర్లుగా పేర్కొంది. 

ఈ జాబితాలో ఏబీసీ సప్లై సంస్థ సహ వ్యవస్థాపకురాలు డైనే హెండ్రిక్స్ వరుసగా ఆరో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచారు. ఏబీసీ సప్లై సంస్థ అమెరికాలో అతిపెద్ద హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. 76 ఏళ్ల హెండ్రిక్స్ నికర ఆస్తి విలువ 15 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ వెల్లడించింది.
Advertisement
Forbes
Self Made
Richest Women
Indian Origin
USA

More Telugu News