Pawan Kalyan: నేను అసెంబ్లీకి వెళ్లుంటే కనీసం లక్ష ఉద్యోగాలు పడేవి: పవన్ కల్యాణ్

Pawan Kalyan take a swipe at CM Jagan in Amalapuram
  • అమలాపురంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
  • బహిరంగ సభలో వాడీవేడిగా ప్రసంగం
  • 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని విమర్శలు
  • నవ్వుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ వచ్చే వ్యక్తిని నిలదీయాలని పిలుపు
  • హలో ఏపీ... బై బై వైసీపీ అంటూ జనసేన ఎన్నికల నినాదం ప్రకటించిన పవన్
రాష్ట్రంలో నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశాడని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న జగన్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పాలని నిలదీశారు. అమలాపురంలో వారాహి విజయ యాత్ర అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. 

ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ... గత ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు యువత ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండేదని అన్నారు. ఓట్లు వేసి వైసీపీని గెలిపించారని, కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదని తెలిపారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపించి ఉంటే కనీసం లక్ష ఉద్యోగాలు పడేవని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 

ఇంకోసారి వారి నాయకుడు నవ్వుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ వస్తే రోడ్డుపైనే నిలదీయండి... 2.3 లక్షల ఉద్యోగాలు ఏవని గట్టిగా ప్రశ్నించండి అని పిలుపునిచ్చారు. 

నేను వారాహిపై వెళుతుంటే మీకెందుకు భయం?

175 సీట్లు, అన్ని ఎంపీ స్థానాలు తమవేనని వైసీపీ నేతలు చెబుతున్నారు... మరి మాపై ప్రతి రోజూ ఎందుకు విమర్శలు చేస్తారు? వారాహి వాహనంపై వెళుతుంటే ఎందుకు భయపడుతున్నారు? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. జనసేన బలం ఏంటన్నది ఇప్పుడు వైసీపీ వాళ్లకు అర్థమైందని తెలిపారు. 

"రాష్ట్రానికి పట్టిన వైసీపీ తెగులును తీసేస్తా... వచ్చే ఎన్నికల్లో నాకు అండగా నిలబడండి. నేనేమీ హైదరాబాద్ నుంచి మాట్లాడడంలేదు... రాజమండ్రిలో పార్టీ  ఆఫీసు పెట్టాను. కాకినాడ, పిఠాపురం, అమలాపురంలోనూ కార్యాలయాలు తెరుస్తాం. నేను కూడా ఇక్కడే ఉంటాను... మా ఇన్చార్జులు కూడా ఇక్కడే ఉంటారు. ఈసారి జనసేనకు గోదావరి జిల్లాలు అండగా ఉండాలి. గోదావరి నదిలా ఇక్కడి ప్రాంతాన్ని అంటిపెట్టుకుని ఉంటాను" అని వివరించారు. 

ఎవరిది క్లాస్ వార్?

"నా సంపాదనలో ట్యాక్సులు కట్టి, రూ.30 కోట్లకు పైగా కౌలు రైతులకు ఖర్చు పెడితే నేను క్లాస్ వార్ చేస్తున్నానని ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు. అక్రమం డబ్బు సంపాదిస్తున్న ఈ ముఖ్యమంత్రి మా గురించి మాట్లాడడమా? ఇసుక, సిమెంట్, గనులు అన్ని దోపిడీ చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రికి క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు. 

క్లాస్ వార్ చేస్తోంది జగనే. క్లాస్ వార్ కు ఆయన ప్రతిరూపం లాంటివాడు. 24 దళిత పథకాలు రద్దు చేశాడు, భవన నిర్మాణ కార్మికులు నిధి మళ్లించాడు, ఉద్యోగుల పెన్షన్ సొమ్ము మళ్లించాడు... ఈ వ్యక్తి క్లాస్ వార్ గురించి ఎలా మాట్లాడతాడు?"

హలో ఏపీ... బై బై వైసీపీ

అమలాపురం సభలో పవన్ కల్యాణ్ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. హలో ఏపీ... బై బై వైసీపీ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేన ఎన్నికల నినాదం ఇదేనని ప్రకటించారు. 
అభివృద్ధి జరగాలంటే- ఈ ప్రభుత్వం మారాలి
అరాచకం ఆగాలంటే- ఈ ప్రభుత్వం పోవాలి
జనం బాగుండాలంటే- జగన్ పోవాలి
... అంటూ పవన్ కల్యాణ్ సభకు వచ్చిన వారితో నినాదాలు చేయించారు.
Pawan Kalyan
Jagan
Amalapuram
Varahi Yatra
Janasena
Andhra Pradesh

More Telugu News