Amit Shah: రేపు హైదరాబాద్ కు అమిత్ షా.. రాజమౌళితో భేటీ.. ప్రభాస్ తో కూడా?

amit shah will meet director ss rajamouli and prabhas in hyderabad
  • రేపు తెలంగాణ పర్యటనకు రానున్న అమిత్ షా
  • 15న బీజేపీ నిర్వహించే కార్యక్రమానికి హాజరు
  • పలు రంగాల ప్రముఖులతో భేటీ కానున్న కేంద్ర మంత్రి
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బుధవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. రేపు సాయంత్రం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. తన పర్యటనలో ‘ఆర్ఆర్ఆర్’ డైరెక్టర్ రాజమౌళితో భేటీ కానున్నారు. అలాగే ప్రభాస్ తో కూడా అమిత్ షా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి ఖమ్మంలో 15వ తేదీన బీజేపీ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా రావాల్సి ఉంది. అయితే ఆ సమావేశానికి ఒకరోజు ముందే రాష్ట్రానికి ఆయన వస్తున్నారు. తన పర్యటనలో నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులతో అమిత్ షా సమావేశం కానున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సినీ, రాజకీయ, మీడియా, క్రీడా రంగాల సెలబ్రిటీలతో పలు అంశాలపై షా చర్చించనున్నట్లు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగానే రాజమౌళి, ప్రభాస్‭తో అమిత్ షా భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నాయి.

ఇటీవల రాష్ట్రాల పర్యటన సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను అమిత్ షా కలుస్తున్నారు. గతంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నితిన్, క్రికెటర్ మిథాలీ రాజ్ తదితరులను కలిసిన విషయం తెలిసిందే.
Amit Shah
Rajamouli
Prabhas
BJP
Khammam

More Telugu News