మద్యం విషయంలో గొడవ.. విద్యుత్ షాక్ తో భార్యను చంపేసిన భర్త
- డబ్బుల కోసం వేధించడంతో గొడవ పడ్డ భార్య
- నిద్రిస్తున్న భార్య తలకు విద్యుత్ వైర్ చుట్టి స్విచ్ఛ్ ఆన్ చేసిన భర్త
- రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ లో దారుణం
కొందుర్గ్ కు చెందిన ఎస్ యాదయ్య 2008లో మమతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత యాదయ్య మద్యానికి బానిసగా మారాడు. రోజూ తాగి వచ్చి గొడవ చేయడం అలవాటుగా మారింది. నిత్యం తాగుతూ ఉండడంతో మమత రోజు కూలీగా మారింది. కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే, యాదయ్య తాగి వచ్చి డబ్బుల కోసం భార్యా పిల్లలను వేధిస్తుండేవాడని చుట్టుపక్కల వారు చెప్పారు.
సోమవారం రాత్రి కూడా ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో భర్తపై మమత చేయిచేసుకుంది. తర్వాత పిల్లలతో కలిసి నిద్రించింది. మంగళవారం తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న మమత తలకు యాదయ్య కరెంట్ వైర్ ను చుట్టి, స్విచ్ వేశాడు. దీంతో షాక్ తగిలి మమత చనిపోయింది. అనంతరం ప్రమాదవశాత్తూ షాక్ తగిలి భార్య చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసుల విచారణలో భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.