Karnataka: ఇప్పుడు నాపై మరింత బాధ్యత ఉంది: డీకే శివకుమార్

Shivakumar accepts formula says more responsibility on me now
  • కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం
  • ఉప ముఖ్యమంత్రిగా పని చేయనున్న డీకే శివకుమార్
  • పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధిష్ఠానం నిర్ణయానికి ఓకే చెప్పానన్న డీకే 
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది. సీఎంగా సీనియర్ నాయకుడు సిద్ధరామయ్యకే అదిష్ఠానం ఓటు వేసింది. ఆ పదవిని ఆశించిన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఎట్టకేలకు బెట్టు వీడారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అంగీకరించినట్లు గురువారం ధ్రువీకరించారు.

‘కర్ణాటక పట్ల మాకు నిబద్ధత ఉంది. పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం నేను ఈ ఫార్ములాను అంగీకరించాను. రాష్ట్రానికి సేవ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు నాపై ఉంది. మేమంతా ఐకమత్యంగా మంచి పాలన అందించాలి’ అని ఆయన చెప్పారు. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల మే 20న బెంగళూరులో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. కాగా, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించడం పట్ల తాను పూర్తిగా సంతోషంగా లేనని కాంగ్రెస్ ఎంపీ, డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ అన్నారు.  

‘ఈ నిర్ణయం పట్ల నేను పూర్తిగా సంతోషంగా లేను. కర్ణాటక ప్రయోజనాల దృష్ట్యా డీకే శివకుమార్ అంగీకరించవలసి వచ్చింది. మేం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. చాలా దూరం వెళ్లాలి. ప్రస్తుతానికి మేం కోరుకున్నది (డీకే శివకుమార్‌కు సీఎం పదవి) అయితే జరగలేదు’ అని డీకే సురేశ్ అన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 135 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ 66 సీట్లకే పరిమితమైంది.
Karnataka
DK Shivakumar
diputy cm
Siddaramaiah

More Telugu News