East Godavari District: వివాహానంతరం వధూవరులు డ్యాన్స్ చేయాలని డిమాండ్.. మండపంలోనే చితక్కొట్టేసుకున్న ఇరు కుటుంబాలు!

  • తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఘటన
  • ఆడపిల్లను డ్యాన్స్ చేయమనడం ఏంటంటూ వధువు కుటుంబం అభ్యంతరం
  • గొడవలో ఓ మహిళ తల పగిలిన వైనం
  • మరో ముగ్గురికి గాయాలు
The bride and groom demand to dance after the wedding Both the families are crushed in the marriage hall

వివాహం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల బంధుమిత్రుల హడావిడితో పెళ్లి మండపం కళకళలాడింది. విందు సమయంలో వధూవరులిద్దరూ డ్యాన్స్ చేయాలని అక్కడున్న వారు పట్టుబట్టారు. ఆడపిల్ల డ్యాన్స్ చేయడం ఏంటంటూ అమ్మాయి తరపు వారు అభ్యంతరం చెప్పారు. ఇది మాటల యుద్ధానికి దారి తీసింది. ఆపై ఇరు కుటుంబాల సభ్యులు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళ తలపగలగా, మరో వ్యక్తి చేయి విరిగింది. మరో ముగ్గురు గాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం రామచంద్రపురంలో నిన్న జరిగిందీ ఘటన. 

రామచంద్రపురానికి చెందిన సుబ్రహ్మణ్యంతో తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన పూజితకు పెళ్లి కుదిరింది. వివాహం కోసం నిన్న అమ్మాయి తరపు వారు రామచంద్రపురం చేరుకున్నారు. పెళ్లి ఘనంగా జరిగింది. అయితే, విందు సమయంలో వధూవరులిద్దరినీ డ్యాన్స్ చేయాలని కోరడం, వధువు తరపు వారు అభ్యంతరం చెప్పడంతో ఈ గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు పెళ్లి మండపానికి చేరుకుని క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వధూవరులు, వేడుకకు హాజరైనవారు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

More Telugu News