Balineni Srinivasa Reddy: మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగాలతో కంటతడి పెట్టిన బాలినేని

  • మాజీ మంత్రి బాలినేనికి సొంత పార్టీలో సెగ
  • తనను టార్చర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాలినేని
  • ఎవరికీ అన్యాయం చేయలేదని వెల్లడి
  • తనపై ఆరోపణలకు ఒక్క ఆధారమైనా చూపగలరా అంటూ సవాల్
  • పార్టీలో బాధ్యత గల నేతను కాబట్టి వ్యక్తుల పేర్లు బయటపెట్టలేనని స్పష్టీకరణ
Balineni breaks into tears in press meet

వైసీపీ ఆవిర్భావం నుంచి తాను పార్టీలో కీలకంగా ఉన్నానని, కానీ ఇటీవల సొంత పార్టీలోనే తనను టార్చర్ చేస్తున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరికీ అన్యాయం చేసిన వ్యక్తిని కాదని, కానీ తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. 

తనపై ఆరోపణలు, ఫిర్యాదులు చేసేవారు ఒక్క ఆధారమైనా చూపగలరా అని ప్రశ్నించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆక్రోశించారు. ఓ దశలో బాలినేని కంటతడి పెట్టారు. ఆవేదనతో గొంతు వణికింది. తనను ఎందుకిలా బాధపెడుతున్నారంటూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. దాదాపు ఆయన మాట్లాడుతున్నంత సేపు కళ్లలో నీళ్లు కనిపించాయి.

1999లో తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టారని, ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి ప్రోత్సహించారని తెలిపారు. 2009లో రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోనే మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, మంత్రిగానూ అవకాశం కల్పించారని వివరించారు. 

తనకు మంత్రి పదవి ఇచ్చిన మూడు నెలలకే ఆయన హఠాన్మరణం పొందడం తన రాజకీయ జీవితంలో తీరని లోటు అని బాలినేని పేర్కొన్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ ఓదార్పు యాత్ర చేపట్టాడని, ప్రకాశం జిల్లాలో ఆయన ఓదార్పు యాత్రలో తాము కూడా నడిచామని వెల్లడించారు. 

మంత్రి పదవి పోతుందని హెచ్చరించినా, తాను గానీ, తన కుటుంబ సభ్యులు కానీ ఏమాత్రం అలోచించకుండా, రాజశేఖర్ రెడ్డి కుటుంబమే తమకు ముఖ్యం అని భావించి ఓదార్పు యాత్రలో పాల్గొన్నామని వివరించారు. జగన్ తోనే మా పయనం అని భావించామని తెలిపారు. ఇక 2019లో జగన్ సీఎం కావడం, నాకు మంత్రి పదవి ఇవ్వడం అందరికీ తెలిసిందేనని బాలినేని తెలిపారు. 

"వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీతోనే ఉన్నాను. ప్రకాశం జిల్లాలో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. గత కొంతకాలంగా కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదటేమో ఒకడు చెన్నై హవాలా అన్నాడు. ఆ తర్వాత భూ కబ్జాలు అన్నారు, వైజాగ్ నుంచి కొన్ని స్టేట్ మెంట్లు వినిపించాయి, సినిమాల్లో డబ్బులు పెట్టుబడి పెట్టానన్నారు. 

ఇవాళ గోనె ప్రకాశ్ రావు అనే ఒకాయన మాట్లాడుతున్నాడు... వైవీ సుబ్బారెడ్డి నాకు రాజకీయ భిక్ష పెట్టాడంట. ఆయన వల్ల రాజకీయాల్లోకి వచ్చానంట. 1979లోనే మా నాన్న జనతా పార్టీ తరఫున పోటీ చేశాడు. రాజకీయాల్లో మా ఫ్యామిలీ ముందో, ఎవరి ఫ్యామిలీ ముందో... మాట్లాడేవాళ్లు ఒకసారి తెలుసుకోవాలి. 

వైవీ సుబ్బారెడ్డిని ఇంద్రుడు చంద్రుడు అని, ఆయన భార్యను ఓ దేవత అని గోనె ప్రకాశ్ రావు కొనియాడారు... అంతవరకు బాగానే ఉంది... గోనె ప్రకాశ్ రావు నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో తెలంగాణలో ఉన్న గోనె ప్రకాశ్ రావు నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను వందల కోట్లు సంపాదించుకున్నానని అంటున్నావ్... అవి ఎక్కడ ఉన్నాయో చెబితే వెళ్లి తెచ్చుకుంటాను. 

నన్ను తిట్టడంతో పాటు జగన్ మోహన్ రెడ్డి గారు జైలుకు పోతాడంటారు, అవినాశ్ రెడ్డి అరెస్ట్ అవుతాడని, భారతమ్మకు నోటీసులు ఇస్తారని, ఇది కచ్చితంగా జరుగుతుందని అంటాడు... మళ్లీ వైవీ సుబ్బారెడ్డిని పొగుడుతాడు. ఏంటిది? ఏం జరుగుతోంది? ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇక ప్రకాశం జిల్లా విషయానికొస్తే... జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాను. నేను మంత్రి పదవిలో ఉన్నా, లేకపోయినా వారికి ఏ పని అయినా చేసేందుకు ప్రయత్నించాను. అంతేతప్ప ఎవరికీ అన్యాయం చేయలేదు. ఒక్కరికైనా నేను అన్యాయం చేశానని చెప్పించమనండి. 

కానీ ఎమ్మెల్యేలతో సీఎంకు నాపై ఫిర్యాదులు చేయిస్తారు... మా నియోజకవర్గాల్లో బాలినేని వాసు జోక్యం చేసుకుంటున్నాడని ఫిర్యాదులు చేస్తారు... సరే మీకంత ఇబ్బందిగా ఉంటే ఆ విషయాలు పట్టించుకోను. నేను మొదటి నుంచి కార్యకర్తల కోసమే పనిచేశాను. ఏదో డబ్బులు సంపాదించుకుందామని, దోచుకుందామని రాలేదు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం. 

వైసీపీలో పార్టీ కోసం ఎంత శ్రమించానో, ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు. కానీ ఏమీ చేయకుండానే ఈ రకమైన నిందలు, ఈ రకమైన ఆరోపణలు నాపై రావడాన్ని భరించలేకపోతున్నాను. ఒక టీడీపీ వ్యక్తిని కలిసి అడగండి... బాలినేని వాసు ఎలాంటివాడో చెబుతాడు. కార్యకర్తలకు న్యాయం చేస్తుంటే నా మీద ఫిర్యాదులు చేయడం చాలా బాధాకరమైన విషయం. 

నా మీద కాకపోతే నా కుమారుడి మీద ఆరోపణలు చేస్తున్నారు... ఈ ఆరోపణలు చేసేవారు ఒక్కటైనా నిరూపించారా అంటే అదీ లేదు. ఎవడో అమెరికా నుంచి పంచ్ ప్రభాకర్ తో మాట్లాడిస్తారు. తప్పు చేశానని ఒక్క ఆధారం చూపించండి... పార్టీ నుంచి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మాట్లాడితే పార్టీ మారుతున్నాడంటారు. 

వైసీపీలోని నేతలే నాపై ప్రచారం చేస్తున్నారు. వీళ్లందరూ నిన్నామొన్నా వచ్చినవాళ్లు. నేను మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్నవాడ్ని. నన్ను ఈ రకంగా ఎందుకు వేధిస్తున్నారో అర్థం కావడంలేదు. ఇది మంచి పద్ధతేనా అని అడుగుతున్నా! 

నన్ను మూడు జిల్లాల పర్యవేక్షకుడిగా వేశారు... కానీ గడప గడపకు కార్యక్రమంలో ఇంటింటికీ తిరగాల్సి ఉండడంతో, ఆ పదవి వద్దన్నాను. సీఎం గారికి కూడా ఇదే చెప్పాను... ఆయన సరే అన్నారు. దీన్ని కూడా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెబుతున్నా... నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వైసీపీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న కార్యకర్తలు, నేతల కోసం ఏ త్యాగమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. 

ఇలాంటి చర్యలతో నాపై అకారణంగా బురదల చల్లుతున్న వాళ్లు ఇకనైనా పునరాలోచించుకోవాలి. పార్టీలో బాధ్యతగా ఉన్నాను కాబట్టి వ్యక్తుల పేర్లు, వారి తప్పుడు పనులు బయటపెట్టలేను. వారెవరో మీడియాకు తెలుసు" అని బాలినేని శ్రీనివాసరెడ్డి వివరించారు.

More Telugu News