పెళ్లింట్లో చోరీ.. పేద కుటుంబానికి గ్రామస్థుల చేయూత
- తెలంగాణలోని నిర్మల్ జిల్లా కిర్గుల్ లో ఘటన
- పేదింటి ఆడపిల్ల పెళ్లి జరిపించేందుకు ఒక్కటైన ఊరి జనం
- తలా కొంత సాయం చేసి రూ.1.5 లక్షలు అందజేసిన వైనం
నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ (బి)కు చెందిన కరాండె గోదావరి, గంగన్న దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. గ్రామంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న గంగన్న ఆదాయం అంతంత మాత్రమే. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో గోదావరి కూలి పనులకు వెళుతోంది. ఇటీవల పెద్ద కూతురుకు పెళ్లి కుదిరింది. మే 7న వివాహానికి ముహుర్తం నిర్ణయించారు. పెళ్లి ఖర్చుల కోసం తెలిసిన వారి వద్ద అప్పు చేసిన గంగన్న.. కొంత బంగారంతో పాటు పెళ్లి సామగ్రి కొని ఇంట్లో పెట్టుకున్నారు.
బుధవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక దొంగలు చొరబడి బీరువాలోని రూ.50 వేల నగదు, 2 తులాల బంగారం, 20 తులాల వెండి ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయాన్నే లేచిన గంగన్న కుటుంబ సభ్యులు ఇంట్లో దొంగలు పడ్డ విషయం గుర్తించి కన్నీటిపర్యంతమయ్యారు. గంగన్న కుటుంబ పరిస్థితి తెలిసిన ఊరి వాళ్లు తామున్నామని ముందుకొచ్చారు. వీడీసీ ఆధ్వర్యంలో చైర్మన్ పోతారెడ్డి రూ.90,000 వేలు, సర్పంచ్ సుధాకర్ రెడ్డి రూ.50,000 వేలు, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి రూ.10 వేలు.. మొత్తంగా రూ.1.50 లక్షలు అందజేశారు.