budget bikes: తక్కువ ఖరీదులో బెస్ట్ బైక్ లు ఇవే!

  • రూ. లక్ష లోపు ధరలో మైలేజ్ ఎక్కువ ఇచ్చే టాప్ 5 టూవీలర్లు
  • మండుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో బైక్ మైలేజీకి పెరిగిన ప్రాధాన్యం
  • లీటర్ కు 70 నుంచి 80 కిలోమీటర్లు పరిగెత్తే బైక్ లకు పెరుగుతున్న ఆదరణ
Top 5 Most Fuel Efficient Bikes Under Rupees 1 Lakh

ప్రస్తుతం బైక్ మన జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. టూవీలర్ లేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఒకటికి రెండు బైక్ లు ఉన్న కుటుంబాల సంఖ్య కూడా ఎక్కువే. బైక్ లేనిదే ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితికి చేరుకున్నాం. అయితే, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడంతో కొత్త బైక్ కొనేటప్పుడు మైలేజీ ఎక్కువిచ్చే వాహనాల వైపే చాలామంది మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ఖరీదులో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్ ల వివరాలు మీకోసం..

రూ. లక్షలోపు ఖరీదులో మంచి మైలేజీ ఇచ్చే టాప్ 5 టూవీలర్లు..

హీరో స్ప్లెండర్ ప్లస్:
దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే టూవీలర్ బ్రాండ్ లలో హీరో స్ప్లెండర్ ప్లస్ కూడా ఒకటి. ఈ బైక్ ను 97.2 సీసీ ఇంజిన్ తో 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ తో కంపెనీ తయారు చేస్తోంది. ఈ బైక్ లీటర్‌కు 80 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఢిల్లీ ఎక్స్ షోరూమ్ లో ఈ బైక్ ధర రూ. 71,586 గా ఉంది.

బజాజ్ ప్లాటినా 100:
తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మంచి మైలేజీ ఇచ్చే బైక్.. బజాజ్ ప్లాటినా 100. ఈ బైక్ ను బజాజ్ కంపెనీ 102 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో తయారుచేస్తోంది. లీటర్ పెట్రోల్ తో బజాజ్ ప్లాటినా 100 బైక్ 70 కిలోమీటర్లు పరుగులు పెడుతుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.65,856 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

టీవీఎస్ సపోర్ట్:
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టీవీఎస్ తయారుచేసిన బైక్ టీవీఎస్ సపోర్ట్.. 109 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ బైక్ లీటర్ కు 70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ టూవీలర్ కిక్ స్టార్ట్ వేరియంట్‌ ధర రూ.64,050 కాగా, సెల్ఫ్-స్టార్ట్ వేరియంట్ ధర రూ. 70,223(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

టీవీఎస్ రాడాన్:
క్లాక్, సర్వీస్ ఇండికేటర్, లో-బ్యాటరీ ఇండికేటర్, టాప్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ ఇండికేటర్ లాంటి అత్యాధునిక ఫీచర్లతో టీవీఎస్ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చిన సరికొత్త మోడల్ బైక్ రాడాన్.. ఈ బైక్ 109.7 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో లీటర్ పెట్రోల్ కు 65 నుంచి 70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర.. రూ.60,925. డిజి డ్రమ్ వేరియంట్ ధర రూ.74,834 కాగా, డిజి డిస్క్ వేరియంట్ రూ.78,834.

బజాజ్ సీటీ110:
అత్యధిక మైలేజ్ అందించే టూవీలర్లలో బజాజ్ సీటీ110 ఒకటి. ఇది 115 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో లీటర్ పెట్రోల్ కు 70 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. దీని ముందు వెనుక డ్రమ్ బ్రేక్‌లతో పాటు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను కంపెనీ అమర్చింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బైక్ ధర రూ.67,322 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

More Telugu News