ఢిల్లీలో ఆప్ నేతల అత్యవసర సమావేశం
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ప్రశ్నిస్తున్న సీబీఐ
- ముఖ్యమంత్రిని సీబీఐ అరెస్టు చేయచ్చన్న ఆందోళనతో నేతలు
- తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు అత్యవసర సమావేశం
మరోవైపు.. సీబీఐ కేజ్రీవాల్‌ను ప్రశ్నించడాన్ని ఖండిస్తూ నిరసనకు దిగిన ఆప్ నేతలు రాఘవ్ ఛద్దా, సంజయ్ సింగ్, జాస్మిస్ షా, ఇతర పార్టీ సభ్యులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతిపూర్వకంగా నిరసనలు తెలుపుతున్న వారిని ఎందుకు అరెస్టు చేశారంటూ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు మోదీ ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీ తదుపరి కార్యాచరణపై నిర్ణయించేందుకు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు.
కాగా..ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ కార్యాలయం వద్ద వెయ్యి మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీబీఐ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడకుండా సెక్షన్ 144 కూడా విధించారు.