Pakistani Drone: పాకిస్థాన్ నుంచి డబ్బులు, బుల్లెట్లతో వచ్చిన డ్రోన్.. కూల్చివేసిన జవాన్లు

  • జమ్మూకశ్మీర్‌ రాజౌరీ జిల్లాలో భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్
  • రూ.2 లక్షలు, 131 రౌండ్ల బుల్లెట్లు, 5 మ్యాగజైన్ల స్వాధీనం
  • ఫిబ్రవరి 26, మార్చి 10న కూడా డ్రోన్లను కూల్చేసిన జవాన్లు
Pakistani Drone Shot Down Near LoC In Rajouri

పాకిస్థాన్ వైపు నుంచి భారత భూభాగంలోకి వచ్చిన డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత గుట్టుచప్పుడు కాకుండా భారత్ భూభాగంలోకి పంపించారని, ఈ డ్రోన్‌ను సైన్యం గుర్తించి, వెంటనే కూల్చివేసిందని అధికారులు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్‌ రాజౌరీ జిల్లాలోని బెరీ పట్టాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ డ్రోన్‌లో భారతీయ కరెన్సీతో పాటు ఆయుధాలు, అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు వివరించారు. 

డ్రోన్‌ను పాక్ భూభాగం నుంచి పంపినట్లు అనుమానిస్తున్నామని భారత భద్రతాధికారులు తెలిపారు. నియంత్రణ రేఖ వద్ద అనుమానాస్పదంగా వైమానిక వస్తువులు తరలిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని, ఈ నేపథ్యంలోనే డ్రోన్ ను కూల్చేశామని చెప్పారు. తర్వాత పరిసర ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని, డ్రోన్ కదలికలను ట్రాక్ చేశామని రక్షణ శాఖ పీఆర్‌వో తెలిపారు.

డ్రోన్‌లో రూ.2 లక్షల భారతీయ నగదు ఉన్నట్లు తెలిపారు. వీటితో పాటు లోడ్ చేసి ఉన్న 131 రౌండ్ల ఏకే-47 బుల్లెట్లు, 5 మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డ్రోన్‌లో ఓ ప్యాకెట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని, సోదాలు కొనసాగుతున్నాయని వివరించారు. 

మరోవైపు మార్చి 10న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో బీఎస్‌ఎఫ్ జవాన్లు.. పాకిస్థాన్ భూభాగం నుంచి వచ్చిన భారీ డ్రోన్‌ను కూల్చివేశారు. బుల్లెట్లు, ఏకే సిరీస్ రైఫిల్, మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఫిబ్రవరి 26న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బీఎస్ఎఫ్ సైనికులు పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చివేశారు.

More Telugu News