Team India: స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు జహీర్ ఖాన్ హెచ్చరిక

  • 2019 ప్రపంచ కప్ సమస్యే పునరావృతం అయ్యేలా ఉందన్న మాజీ పేసర్
  • నాలుగో నంబర్ లో సరైన బ్యాటర్ ను ఎంచుకోవాలని సూచించిన జహీర్
  • ఆ స్థానంలో వచ్చి ఆసీస్ తో మూడు వన్డేల్లోనూ డకౌటైన సూర్యకుమార్
Zaheer Khan Sends India Warning Over 2019 World Cup Problem

టీమిండియా ఆటతీరుపై మాజీ పేసర్ జహీర్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు గాయం, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్‌ వరుస వైఫల్యాలు.. 2019 వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియాకు ఎదురైన సమస్యనే పునరావృతం అయ్యేలా ఉందని జట్టును హెచ్చరించాడు. నాలుగేళ్ల కిందట జరిగిన మెగా టోర్నీకి ముందు భారత్ నాలుగో నంబర్ లో శాశ్వత బ్యాటర్‌ను కనుగొనలేక ఇబ్బంది పడింది. ఇక, ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచ కప్ భారత్ లో జరగనుంది.

ఈ క్రమంలో ఆతిథ్య జట్టు 4వ నంబర్ బ్యాటింగ్ స్థానాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని జహీర్ అభిప్రాయపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో నాలుగో నంబర్ కు సరైన బ్యాటర్ అని అనుకున్నారు. కానీ, ఆసీస్ తో మూడు వన్డేల్లోనూ అతను సున్నా చుట్టడంతో ఈ స్థానంపై మరోసారి అనిశ్చితి మొదలైంది. దీనిపై జహీర్ స్పందించాడు.

‘టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను పున:పరిశీలించాల్సి ఉంది. నాలుగో నంబర్ ఆప్షన్ ను గుర్తించాలి. 2019 ప్రపంచ కప్‌కు ముందు కూడా ఈ స్థానంపైనే చర్చ నడిచింది. నాలుగు సంవత్సరాలు గడిచినా ఈ సమస్యకు పరిష్కారం లభించక ఇప్పటికీ మనం ఒకే పడవలో ఉన్నట్లుంది. ఈ స్థానంలో శ్రేయస్ అయ్యర్ సరైన వ్యక్తి అనుకున్న విషయం నిజమే. అతనికి మిడిలార్డర్ బాధ్యతలు అప్పగించారు. కానీ, గాయం వల్ల అతను మరికొంతకాలం దూరం అయితే మాత్రం ఈ విషయంలో చాలా ప్రశ్నలకు సమాధానం వెతకాల్సి ఉంటుంది’ అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. కాగా, ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో జట్టు ఓటమి తర్వాత విలేకరుల సమావేశంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. సూర్యకుమార్‌కు మద్దతు ఇవ్వడం గమనార్హం.

More Telugu News