YS Sharmila: లిక్కర్ స్కాం నుంచి తప్పించుకోవడానికే కవిత డ్రామాలు: షర్మిల

  • మహిళా రిజర్వేషన్ అంశంపై ఢిల్లీలో కవిత దీక్ష
  • చిత్తశుద్ధి ఉంటే ప్రగతి భవన్ ఎదుట దీక్ష చేపట్టాలన్న షర్మిల
  • తెలంగాణలో ఎంతమంది మహిళలకు అవకాశం ఇచ్చారంటూ ప్రశ్నించిన వైనం
  • ఢిల్లీలో దీక్ష చేపట్టడం హాస్యాస్పదం అని విమర్శలు
Sharmila comments on Kavitha

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. కవిత ముందుగా ప్రగతి భవన్ ఎదుట పోరాటం చేయాలని హితవు పలికారు. లిక్కర్ స్కాం నుంచి తప్పించుకోవడానికే కవిత ఈ డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. 

2014 ఎన్నికల్లో  కేసీఆర్ రాజకీయంగా ఎంతమంది మహిళలకు అవకాశం ఇచ్చారు? 119 స్థానాలకు గాను 6 స్థానాల్లో మహిళలకు అవకాశం ఇచ్చారు. 2018లో ఎంతమందికి అవకాశం ఇచ్చారు?... నలుగురికి ఇచ్చారు అంటూ వివరించారు. తెలంగాణలో మహిళా కమిషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? అంటూ మండిపడ్డారు. 

గవర్నర్ తమిళిసైపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే కవిత ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అలాంటి కవిత ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తుండడం హాస్యాస్పదం అని షర్మిల పేర్కొన్నారు. 

తెలంగాణలో కనీసం నాలుగైదు శాతం కూడా మహిళా రిజర్వేషన్ లేదు కానీ, ఢిల్లీలో మీరు పోరాటం చేస్తున్నామని చెప్పుకోవడం చూస్తుంటే మీకు చిత్తశుద్ధి ఉందని నమ్మాలా? అని నిలదీశారు. లిక్కర్ స్కాంలో రేపో మాపో అరెస్ట్ కాబోతోందని తెలిసే, ఇప్పుడీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని షర్మిల ఆరోపించారు.

More Telugu News