KL Rahul: కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాక్.. వైస్ కెప్టెన్సీ నుంచి తొలగింపు

BCCI shock for KL Rahul and Removal from vice captaincy
  • ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన
  • వైస్ కెప్టెన్‌గా ఎవరినీ ప్రకటించకుండా ఆశ్చర్యపరిచిన బీసీసీఐ
  • వైస్ కెప్టెన్సీ ట్యాగ్‌ను లాక్కున్నా జట్టులో మాత్రం చోటు కల్పించిన సెలక్టర్లు
ఫామ్ కోల్పోయి పరుగుల కోసం ఏడాదిగా తంటాలు పడుతున్న టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాకిచ్చింది. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి భారత జట్టు నాయకత్వ టీంలో  భాగమైన రాహుల్ శ్రీలంక‌తో సిరీస్ తర్వాత టెస్టు జట్టు శాశ్వత వైస్ కెప్టెన్ అయ్యాడు. అయితే, గత ఏడాది కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేకపోవడం, ఈ కాలంలో ఒకే ఒక్క అర్ధ సెంచరీ సాధించడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. సత్తా ఉన్న యువ ఆటగాళ్లను  పక్కనపెట్టి అతడికి చోటు కల్పిస్తున్నా దానిని నిలబెట్టుకోలేకపోవడంతో తాజాగా అతడి వైస్ కెప్టెన్సీ పదవిని బీసీసీఐ లాక్కుంది.

ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టులకు నిన్న జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రాహుల్ నుంచి వైస్ కెప్టెన్ ట్యాగ్‌ను తీసేసింది. అయితే, విచిత్రంగా ఇంకెవరినీ వైస్ కెప్టెన్‌గా ప్రకటించకపోవడం గమనార్హం. వైస్ కెప్టెన్సీ నుంచి రాహుల్‌ను తప్పించినప్పటికీ జట్టులో మాత్రం అతడికి చోటు కల్పించింది. బంగ్లాదేశ్ పర్యటనలో చతేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ తాజాగా అతడి పేరును కూడా బీసీసీఐ పరిగణనలోకి తీసుకోలేదు. 

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఒక మ్యాచ్‌కు, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో రాహుల్ జట్టును నడిపించాడు. అయితే, అతడి బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడంతో జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. జట్టు లీడర్‌షిప్ గ్రూపులో రాహుల్ భాగమయ్యాక ఏడు టెస్టులు ఆడి కేవలం 175 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గతేడాది ఒక్కసారి మాత్రమే అర్ధ సెంచరీ మార్కును చేరుకోగలిగాడు. 

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ రాహుల్‌ను బీసీసీఐ కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో రాహుల్‌కు చోటు దక్కినప్పటికీ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత దాదాపు ప్రతి టీ20 మ్యాచ్‌కు పాండ్యా సారథ్యం వహించాడు. ఇక, ఆసీస్‌తో జరగాల్సిన మిగతా రెండు టెస్టుల్లో రాహుల్‌కు కనుక తుది జట్టులో చోటు దక్కితే యువ ఆటగాడు గిల్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది.
KL Rahul
Team India
Australia
Border Gavaskar Trophy
BCCI

More Telugu News