Australia: నేటి నుంచే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. సమవుజ్జీల వేటకు వేళాయె!

  • నాగ్‌పూర్‌లో ఈ ఉదయం 9.30 గంటలకు తొలి టెస్టు ప్రారంభం
  • అన్ని విభాగాల్లోనూ సమవుజ్జీలుగా ఇరు జట్లు
  • ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న కంగారూ జట్టు
  • ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌పై కన్నేసిన భారత్
First Test In Border Gavaskar Trophy Between India vs Australia starts Today

సమవుజ్జీల వేటకు సర్వం సిద్దమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ ఉదయం 9.30 గంటలకు నాగ్‌పూర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టును కంగుతినిపించిన భారత జట్టుకు స్వదేశంలోనూ ఆసీస్‌పై తిరుగులేని రికార్డు ఉంది. ఈ రికార్డును కాపాడుకోవాలని భారత్  ఉవ్విళ్లూరుతుండగా.. ఓటములకు కసి తీర్చుకోవాలని ఆస్ట్రేలియా పట్టుదలగా ఉంది.  

ఈ సిరీస్‌లో కనుక భారత జట్టు విజయం సాధిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ సిరీస్‌లో గెలిచేదెవరన్న దానిపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఇరువైపులా మొగ్గు చూపుతున్నారు. అయితే, భారత్ గురి మాత్రం పూర్తిగా ఈ సిరీస్‌పైనే ఉంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు కనీసం మూడు టెస్టుల్లో విజయం సాధిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. 

ఇక, స్వదేశంలో పులుల్లా గర్జించే భారత జట్టుకు ఈ సిరీస్ పరీక్షే. స్టార్ బౌలర్ బుమ్రా లేకపోవడం జట్టుకు పెద్ద లోటు. అలాగే, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ దూరం కావడం కూడా దెబ్బే. పంత్ స్థానాన్ని కేఎస్ భరత్ భర్తీ చేసే అవకాశం ఉంది. అన్ని రంగాల్లోనూ రాణిస్తే తప్ప ఆసీస్‌ వంటి బలమైన జట్టుపై గెలుపు సాధ్యం కాదు. జట్టు కూర్పు అద్భుతంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఇక, భారత్ తన ఆయుధమైన ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జడేజా, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తోడుగా మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లో ఎవరో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇక, మహ్మద్ సిరాజ్, షమీ పేస్ దళాన్ని నడిపిస్తారు. 

మరోవైపు, స్వదేశంలో 2018-19, 2020-21లో జరిగిన రెండు సిరీస్‌లలోనూ భారత్ చేతిలో చావుదెబ్బలు తిన్న కంగారూ జట్టు ఈ సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. భారత్‌ను భారత్‌లోనే ఓడించడం ద్వారా దెబ్బకొట్టాలని చూస్తోంది. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న ఆ జట్టు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. ఖవాజా, స్మిత్, లబుషేన్, వార్నర్ వంటివారు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోగలరు. ఖవాజా, స్మిత్ మంచి ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే, ఆల్‌రౌండర్ గ్రీన్ గాయంతో జట్టుకు దూరం కావడం ఆ జట్టుకు ఎదురుదెబ్బేనని చెబుతున్నారు.

More Telugu News