Kerala: బిడ్డకు జన్మనిచ్చి చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్ జంట!

Kerala transgender couple blessed with baby
  • తల్లిదండ్రులం కాబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన కేరళ ట్రాన్స్‌జెండర్ జంట
  • బిడ్డకు జన్మనిచ్చిన తొలి జంటగా చరిత్ర
  • జంటపై అభినందనల వెల్లువ
కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్ జంట జహాద్-జియా పావల్ చరిత్ర సృష్టించింది. తాము తల్లిదండ్రులం కాబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన ఈ జంట తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కొజికోడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జహాద్ నిన్న ఉదయం సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. ఫలితంగా తల్లిదండ్రులైన తొలి ట్రాన్స్‌జెండర్ జంటగా వారు రికార్డులకెక్కారు. 

జహాద్, జియా పావల్ మూడేళ్ల నుంచి కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలో సంతానం కావాలని భావించి ఎవరినైనా దత్తత తీసుకోవాలని తొలుత భావించారు. అయితే, దత్తత నిబంధనలు కఠినంగా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సొంతంగా సంతానం కనాలని నిర్ణయించుకున్న ఆ జంట ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

ఎలా సాధ్యం?
జియా పురుషుడిగా జన్మించి స్త్రీగా మారగా, మహిళగా జన్మించిన జహాద్ పురుషుడిగా మారాలని నిర్ణయించుకుని శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. కానీ ఆ సర్జరీ సమయంలో గర్భాశయం సహా మరికొన్ని అవయవాలను తొలగించకపోవడం మంచిదైంది. జహాద్ గర్భం దాల్చడానికి అది పనికొచ్చింది.  

పూర్తి ఆరోగ్యంగా..
తాము తల్లిదండ్రులం కాబోతున్నట్టు ఇటీవల జహాద్, జియాపావెల్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా, ఇప్పుడు బిడ్డకు జన్మనివ్వడం ద్వారా ఏకంగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం బేబీ, జహాద్ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. విషయం తెలిసిన ట్రాన్స్‌జెండర్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ జంటను సోషల్ మీడియా ద్వారా అభినందిస్తున్నారు. ఈ జంటకు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అభినందనలు తెలిపారు. తాను ఈసారి కోజికోడ్ వచ్చినప్పుడు వారిని కలుస్తానని తెలిపారు.
Kerala
Transgender Couple
Ziya Paval
Zahhad

More Telugu News