భారత్‌ సాయంపై తుర్కియే ప్రశంసల వర్షం

Earthquake Hit Turkey Thanks India
  • భారత్‌‌ తమ ‘దోస్త్’ అన్న తుర్కియే దేశ రాయబారి
  • అవసరానికి అండగా నిలిచేవాళ్లే నిజమైన స్నేహితులంటూ వ్యాఖ్య
  • తుర్కియేకు వైద్యులు, మెడికల్ సామగ్రిని తరలించిన భారత్
భారీ భూకంపంతో అతలాకుతలమైన తుర్కియే (టర్కీ)కు అండగా నిలిచిన భారత్‌పై ఆ దేశ రాయబారి ఫిరాత్ సునెల్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌ను ఫ్రెండ్ అని సంబోధించిన ఆయన.. అవసరంలో అక్కరకు వచ్చిన వారే నిజమైన స్నేహితులని సోమవారం ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. టర్కీ, హిందీ భాషల్లో ‘దోస్త్’ ఉమ్మడి పదంగా ఉందని చెప్పుకొచ్చారు. అంతకుమునుపు.. భారత విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ తుర్కియే రాయబారితో సమావేశమయ్యారు. అక్కడి ప్రజలకు భారత్‌ తరపున సంఘీభావం తెలిపారు. 

భూకంపం సమాచారం అందగానే భారత్ తుర్కియేకు వైద్య సిబ్బంది, సహాయ సామగ్రిని తరలించింది. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు, మెడికల్ టీమ్స్‌ను టర్కీకి పంపించేందుకు నిర్ణయించినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం అంతకుముందు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో తుర్కియే ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. మొత్తం రెండు వందల మంది సిబ్బంది ఉన్న 2 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను తుర్కియే సహాయార్థం పంపించేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది. ప్రధాన మంత్రి ముఖ్య సలహాదారు పీ.కే.మిశ్రా ఆధ్వర్యంలో సౌత్‌ బ్లాక్‌లో తుర్కియేకు అందించాల్సిన తక్షణ సాయంపై సమావేశం జరిగింది.

తుర్కియే, సిరియా దేశాల్లో సోమవారం సంభవించిన భారీ భూకంపం.. ఈ శతాబ్దంలోని భారీ భూకంపాల్లో ఒకటిగా రికార్డుల కెక్కింది. శిథిలమైన భవనాలు, ప్రజల ఆర్తనాదాలతో ఆ ప్రాంతాలు మరుభూమిని తలపిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి బలైన వారి సంఖ్య ప్రస్తుతం 4 వేలు దాటింది. ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Go Back to Shorts
Turkey
India
Earthquake

More Telugu News