24 గంటల్లో రాజీనామా చేయండి.. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడికి కేంద్ర క్రీడాశాఖ అల్టిమేటం

20-01-2023 Fri 10:51 | National
  • మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్
  • ఆయనను తప్పించాలని ఢిల్లీలో ధర్నా చేస్తున్న భారత స్టార్ రెజ్లర్లు
  • నేరస్థుడు అనే ముద్రతో రాజీనామా చేయనని, విచారణకు సిద్ధమంటున్న బ్రిజ్
WFI Controversy Sports Ministry Asks President Brij Bhushan Sharan Singh Resign Within 24 Hours
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు క్రీడా మంత్రిత్వ శాఖ అల్టిమేటం జారీ చేసింది. 24 గంటల్లో తన పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్టు క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. 

బ్రిజ్ ను తప్పించాలని, రెజ్లింగ్ ఫెడరేషన్ ను రద్దు చేయాలని ఢిల్లీలో ధర్నా చేస్తున్న రెజ్లర్లతో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తన నివాసంలో సమావేశమైన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. గురువారం మంత్రిని కలిసిన రెజ్లర్లలో బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, రవి దహియా ఉన్నారు. బ్రిజ్, రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా వీరితోపాటు దాదాపు 30 మంది సీనియర్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. 

బ్రిజ్, కొంతమంది కోచ్‌లతో కలిసి లక్నోలోని జాతీయ శిబిరాల్లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని వినేష్ ఆరోపించారు. కాగా, నేరస్థుడు అనే ముద్రతో పదవికి రాజీనామా చేయడానికి తాను ఇష్టపడనని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. ‘నాపై చేస్తున్న ఆరోపణల విషయంలో రెజ్లర్ల వద్ద ఏవైనా రుజువులు ఉంటే వాటిని బహిరంగపరచండని నేను తొలి రోజే చెప్పా. నాపై లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువైతే ఉరిశిక్షకు అయినా సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పాను. నేను 10 సంవత్సరాలుగా డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఉన్నాను. నాపై వచ్చిన ఆరోపణలపై కేసును, సీబీఐ విచారణ సైతం ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమే. రెజ్లింగ్ సమాఖ్య, దేశం కంటే నేనేమీ పెద్ద కాదు’ అని బ్రిజ్ స్పష్టం చేశారు.