లంక కెప్టెన్ శతకం కోసం.. రోహిత్ అనూహ్య నిర్ణయం
- తొలి వన్డేలో 67 పరుగుల తేడాతో భారత్ విజయం
- షమీ బౌలింగులో నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న షనక అవుట్
- అప్పటికి సెంచరీకి రెండు పరుగుల దూరంలో లంక కెప్టెన్
- షనక సెంచరీ కోసం అప్పీల్‌ను వెనక్కి తీసుకున్న రోహిత్ శర్మ
- భారత్ కెప్టెన్ నిర్ణయంపై ప్రశంసల వర్షం
మొత్తంగా 88 బంతులు ఎదుర్కొన్న షనక 12 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 108 పరుగులు చేసి తన ఖాతాలో మరో సెంచరీ వేసుకున్నాడు. అయితే, ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ షమీ వేసిన చివరి ఓవర్‌లో షనక అవుటైనా టీమిండియా సారథి రోహిత్ శర్మ పుణ్యమా అని సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్ నాలుగో బంతి వేస్తున్న సమయంలో షనక నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్నాడు. అప్పటికి షనక సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్నాడు.
షమీ నాలుగో బంతిని సంధించక ముందే షనక క్రీజు వదిలి బయటకు వచ్చాడు. గమనించిన షమీ వికెట్లను గిరాటేసి అప్పీల్ చేశాడు. నిజానికైతే ఇది అవుటే. అయితే, అనుమానం ఉన్న ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు వదిలేశాడు. అయితే, అప్పటికి షనక 98 పరుగులతో ఉండడంతో రోహిత్ శర్మ కల్పించుకున్నాడు. షమీతో మాట్లాడి అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో లంక కెప్టెన్ బతికిపోయాడు. ఆ బంతికి ఓవర్ త్రో కారణంగా ఐదు పరుగులు వచ్చాయి. స్ట్రయికింగ్‌కు వచ్చిన షనక ఐదో బంతిని బౌండరీకి పంపి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షనక సెంచరీ కోల్పోకుండా రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.