మంచి మూడ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు అడగొద్దు: మమతా బెనర్జీ

  • హౌరా-న్యూజల్పాయిగురి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు
  • గత నెల 30న ప్రారంభించిన ప్రధాని మోదీ
  • ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలో రెండు రాళ్ల దాడులు
  • ఈ ఘటనపై అడిగిన ప్రశ్నలకు ఇప్పుడిలాంటివి తగవంటూ మమత సమాధానం
IAm in good mood dont ask about that says Mamata Banerjee

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఇటీవల జరిగిన రాళ్ల దాడి ఘటనలకు సంబంధించి అడిగిన ప్రశ్నకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నోటి నుంచి ఊహించని సమాధానం వచ్చింది. హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును గత నెల 30న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు రైలుపై రాళ్లదాడి జరిగింది. మొదటి దాడి మాల్దాలోని కుమార్‌గంజ్ సెక్షన్‌లో సోమవారం జరగ్గా కిటికీ అద్దాలు బద్దలయ్యాయి. అయితే, ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. 

ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై జరిగిన రాళ్ల దాడి ఘటనల గురించి విలేకరులు మమతను ప్రశ్నించారు. స్పందించిన మమత తానిప్పుడు మంచి మూడ్‌లో ఉన్నానని, ఈ సమయంలో ఇలాంటి ప్రశ్నలు తగవని అన్నారు. తాను గంగాసాగర్ మేళాకు వెళ్తున్నానని, మంచి మూడ్‌లో ఉన్నానని, మీరు ఏదైనా అడగదలచుకుంటే గంగాసాగర్ గురించి అడగాలని సూచించారు.

గంగాసాగర్ మేళా ఈ నెల 8 నుంచి 17 వరకు జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మమత పరిశీలించనున్నారు. అలాగే, అక్కడ ఏర్పాటు చేసిన మూడు శాశ్వత హెలిప్యాడ్‌లను నేడు ప్రారంభించాల్సి ఉంది. అక్కడికి బయలుదేరుతున్న సమయంలో మమత వద్ద విలేకర్లు వందేభారత్ రైలుపై జరిగిన రాళ్ల దాడి ఘటనలను ప్రస్తావించారు. దీంతో ఆమె పై విధంగా సమాధానం చెప్పారు.

More Telugu News