టోక్యోను విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్తే రూ. 6.35 లక్షలు.. జపాన్ ప్రభుత్వం ఆఫర్!
- 3.80 కోట్లకుపైగా జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా టోక్యోకు గుర్తింపు
- అందరూ టోక్యోకు వచ్చేస్తుండడంతో పడిపోతున్న ఇతర నగరాల జనాభా
- 2019 నుంచి ప్రోత్సాహకాలు ఇస్తున్న జపాన్
- 2021లో టోక్యోను వీడింది 2,400 కుటుంబాలు మాత్రమే
టోక్యోను వీడే కుటుంబంలోని ఒక్కో బిడ్డకు ప్రభుత్వం గతంలో 3 లక్షల యెన్‌ల చొప్పున ఇవ్వగా, ఇప్పుడు దానిని రూ. 10 లక్షల యెన్‌ల (దాదాపు రూ. 6.35 లక్షలు) కు పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి రానుంది. జననాల రేటు తక్కువగా ఉన్న, వృద్ధులు అధికంగా ఉన్న ప్రాంతాలకు కుటుంబాలు తరలివెళ్లేందుకు 2019 నుంచి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది.
ఒకరికంటే ఎక్కువమంది పిల్లలున్న కుటుంబానికి గతంలో 30 లక్షల యెన్‌లవరకు ఆర్థిక సాయంతోపాటు ఒక్కో బిడ్డకు 3 లక్షల యెన్‌ల చొప్పున చెల్లించింది. వెళ్లిన ప్రాంతంలో సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే అందుకు కూడా ఆర్థిక సాయం అందించేది. అయినప్పటికీ మార్పు కనిపించలేదు. 2021లో 2,400 కుటుంబాలు మాత్రమే టోక్యోను వీడి ఇతర ప్రాంతాలకు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని మరింత పెంచింది.