రష్యా కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టే యోచన!
- అన్ని సాయుధ ఘర్షణలు దౌత్య మార్గంలోనే ముగుస్తాయన్న పుతిన్
- తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నప్పటికీ ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోందని ఆరోపణ
- దాడులు ఆపి, తమ భూభాగాన్ని తిరిగి ఇచ్చేస్తే అప్పుడు చూద్దామన్న ఉక్రెయిన్
- బైడెన్-జెలెన్‌స్కీ భేటీ తర్వాత రష్యా నుంచి ప్రకటన
తాజాగా పుతిన్ మాట్లాడుతూ.. దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. శత్రుత్వం తీవ్రత భరించలేని నష్టాలకు దారితీస్తుందని తాను ఇప్పటికే పలుమార్లు చెప్పినట్టు పుతిన్ గుర్తు చేశారు. అన్ని సాయుధ ఘర్షణలు దౌత్య మార్గంలో ఏదో ఒకరమైన చర్చల ద్వారానో, లేదంటే మరోలానో ముగుస్తాయని పుతిన్ అన్నారు.
మరోవైపు, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్ మాత్రం వ్యతిరేకిస్తోందని రష్యా చెబుతోంది. అయితే, ఉక్రెయిన్ వాదన మరోలా ఉంది. చర్చలు జరగాలంటే తొలుత దాడులు ఆపి, తమ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తిరిగి అప్పగిస్తే అప్పుడు చూద్దామని ఉక్రెయిన్ చెబుతోంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ తర్వాతి రోజునే పుతిన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.