తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర కేసుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
- బీజేపీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని విమర్శ
- ఎమ్మెల్యేల కొనుగోలుకు ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుందన్న కేజ్రీవాల్
- ఢిల్లీలో 41 మంది ఆప్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని నిందితులు చెప్పారని వ్యాఖ్య
ఈ కేసులో నిందితులు ఢిల్లీలో 41 మంది ఎమ్మెల్యేలు తమ టచ్‌లో ఉన్నారని, ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఇస్తామని చెప్పినట్టు వీడియోలో స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. ముగ్గురు వ్యక్తులు తెలంగాణ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర చూపుతున్నారని, ఎమ్మెల్యేలను అమిత్‌షాతో భేటీ చేయిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. 41 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొంటున్నామని, ఢిల్లీలో త్వరలోనే ప్రభుత్వం పడిపోబోతున్నదని నిందితులు చెప్పారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమున్నదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.