West Bengal: మాల్ లో చాక్లెట్ దొంగిలించిన యువతి.. వీడియో వైరల్ కావడంతో ఆత్మహత్య

  • పశ్చిమ బెంగాల్ లో దారుణం
  • షాపింగ్ మాల్ సిబ్బంది తీరుపై స్థానికుల ఆగ్రహం
  • యువతి తల్లిదండ్రులతో కలిసి మాల్ ముందు ఆందోళన
Bengal Teen Steals Chocolate At Mall Died By Suicide

సరదాగా షాపింగ్ కు వెళ్లిన యువతి మాల్ లో ఉన్న చాక్లెట్లను దొంగిలించింది. మాల్ నుంచి బయటకు వెళ్లిపోతుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడంతో తప్పైపోయిందని చెప్పి, చాక్లెట్ల డబ్బులు చెల్లించింది. అక్కడితో అయిపోయిందని భావించిన సదరు కాలేజ్ స్టూడెంట్ కు సోషల్ మీడియాలో తన దొంగతనానికి సంబంధించిన వీడియో కనిపించింది. అవమానభారంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్ లోని జైగావ్ లో చోటుచేసుకుంది. 

తల్లిదండ్రుల కథనం ప్రకారం.. జైగావ్ కు చెందిన యువతి ఓ షాపింగ్ మాల్ లో చాక్లెట్లు దొంగతనం చేసింది. ఆ తతంగమంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. చాక్లెట్ల ఖరీదును ఆమె నుంచి వసూలు చేసి వదిలిపెట్టారు. అప్పటికే తన ఫొటోలు తీసుకోవడంతో వాటిని ఎవరికీ షేర్ చేయొద్దంటూ ఆ యువతి ప్రాధేయపడింది. అయితే, షాపింగ్ మాల్ సిబ్బంది సదరు వీడియోను, ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో స్థానికంగా వైరల్ గా మారాయి. దీంతో స్నేహితులు, బంధువుల ముందు తన పరువు పోయిందని భావించిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.

మాల్ సిబ్బంది తీరుపై యువతి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాక్లెట్లకు డబ్బులు చెల్లించాక కూడా తన కూతురిని వేధించారని మండిపడ్డారు. అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ ఇలా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడమేంటని ప్రశ్నించారు. వాళ్లు చేసిన పనికి తన కూతురిని కోల్పోయానని ఆరోపిస్తూ స్థానికులతో కలిసి మాల్ ముందు ఆందోళన నిర్వహించారు. ఆపై పోలీసులను ఆశ్రయించారు.

More Telugu News