Kamareddy District: ఈ పాత్ర రెండువేల ఏళ్ల నాటిది.. బాన్సువాడలో బయటపడింది!

archaeologists found ancient stoneware in banswada
  • బాన్సువాడ సమీపంలోని బోర్లాం గ్రామంలో మట్టి దిబ్బపై లభ్యం
  • ప్రాకృత భాష, బ్రహ్మీలిపిలో లఘుశాసనం
  • శాతవాహన కాలం నాటి చారిత్రక అవశేషంగా గుర్తింపు
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండువేల సంవత్సరాల నాటి పాత్ర లభ్యమైంది. ఈ మేరకు తెలుగు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, పబ్లిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ హెరిటేజ్ సంస్థ (ప్రిహా) ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాస్ తెలిపారు. బాన్సువాడ సమీపంలోని బోర్లాం గ్రామంలో ఓ మట్టిదిబ్బపై ఈ పాత్ర లభించినట్టు చెప్పారు. దీనిపై క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ప్రాకృత భాష, బ్రహ్మీ లిపిలో లఘుశాసనం ఉన్నట్టు పేర్కొన్నారు.

మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలో దొరికిన బ్రహ్మీ లఘు శాసనాల్లో ఇది ఆరోదని శ్రీనివాస్ వివరించారు. మంజీరా నదికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇది లభించినట్టు పేర్కొన్నారు. దీనిని శాతవాహన కాలం నాటి చారిత్రక అవశేషంగా గుర్తించినట్టు చెప్పారు. పాత్రపై ఉన్న శాసనంలో ‘హిమాబుధియ’ అని ఐదక్షరాలతో బ్రహ్మీ లిపి ఉందన్న ఆయన.. హిమా పదానికి స్త్రీ బౌద్ధ భిక్షువు అని అర్థం కావొచ్చని దీనిని పరిశీలించిన ఎపిగ్రఫిస్ట్ మునిరత్నం రెడ్డి పేర్కొన్నారు.
Kamareddy District
Banswada
Ancient Stoneware
Satavahana Dynesty

More Telugu News