15 నిమిషాల ప్రయాణానికి రూ.32 లక్షలు చార్జి చేసిన ఉబర్​.. ఎందుకో తెలుసా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

15 నిమిషాల ప్రయాణానికి రూ.32 లక్షలు చార్జి చేసిన ఉబర్​.. ఎందుకో తెలుసా?

Uber charges rs 32 lakh to british man for a 15 minute ride
  • ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ లో ఆరేడు కిలోమీటర్లు ప్రయాణించిన యువకుడు
  • డ్రాప్ లొకేషన్ పేరు ఒకేలా ఉండటంతో ఆస్ట్రేలియాలో దిగినట్టుగా చూపిన యాప్
  • ఇంగ్లండ్ నుంచి ఆస్ట్రేలియా దాకా క్యాబ్ లో ప్రయాణించినట్టు చూపి బిల్లు వేసిన వైనం
  • యువకుడి ఫిర్యాదుతో సరిచేసిన ఉబర్ ఇంజనీర్లు
ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోలో, బస్సులో ఎక్కుతాం. ఆన్ లైన్ యాప్ లు వచ్చినప్పటి నుంచి క్యాబ్ లు బుక్ చేసుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. మొదట్లో కొన్నాళ్లు బాగానే ఉన్నా.. తర్వాత క్యాబ్ ల చార్జీలు పెంచేస్తూ వచ్చారు. ఇక డిమాండ్ ఎక్కువున్న సమయంలో సర్జ్ చార్జీల పేరుతో రెండు మూడింతలు ఎక్కువగా వసూలు చేయడం మొదలుపెట్టారు. కొద్ది దూరానికే వందల్లో, వేలల్లో చార్జీలు పడుతున్న ఘటనలూ తెలుసు. అయితే బ్రిటన్ లో ఓ వ్యక్తి కేవలం 15 నిమిషాల పాటు ఉబర్ క్యాబ్ లో ప్రయాణిస్తే ఏకంగా రూ.32 లక్షల మేర బిల్లు వేయడం కలకలం రేపింది.

పొద్దున్నే బిల్లు చూసి..
ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ కు చెందిన ఓలివర్ కల్పన్ అనే యువకుడు తన స్నేహితులను కలవడానికి బయలుదేరారు. తాను ఉన్న చోటికి కేవలం ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ బార్ దగ్గరికి ఉబర్ క్యాబ్ ను బుక్ చేసుకున్నాడు. తన ఉబర్ ఖాతాను క్రెడిట్ కార్డుకు ముందే అనుసంధానం చేసి పెట్టుకోవడంతో బిల్లు ఆటోమేటిగ్గా కట్ అవుతుంది. దానితో క్యాబ్ దిగి వెళ్లిపోయాడు.

స్నేహితులతో పార్టీ చేసుకున్నాక ఇంటికి వచ్చి పడుకున్నాడు. కానీ పొద్దున్నే తన ఫోన్ కు వచ్చిన మెసేజ్ చూసి.. రాత్రి తాగినదంతా దిగిపోయింది. ఎందుకంటే అతడికి ఉబర్ ఏకంగా 39,317 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.32 లక్షలు) బిల్లు వేసింది.

డ్రాప్ లొకేషన్ మారిపోయి..
  • బిల్లును చూసి లబోదిబోమన్న కల్పన్ వెంటనే ఉబర్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేశాడు. అంత బిల్లు వచ్చింది నిజమేనని.. అయితే క్రెడిట్ కార్డులో అంత బ్యాలెన్స్ లేనందువల్ల పేమెంట్ రిజెక్ట్ అయిందని కస్టమర్ కేర్ సిబ్బంది చెప్పారు. ఆ బిల్లు కట్టాలని కోరారు. అయితే తాను వెళ్లిన దూరానికి అంత బిల్లు ఎలా వచ్చిందంటూ కల్పన్ ఫిర్యాదు చేశాడు.
  • కల్పన్ ఫిర్యాదుతో పరిశీలించిన ఉబర్ ఇంజనీర్లు.. తాను ప్రయాణించిన చోటు (డ్రాపింగ్) లొకేషన్ మారిపోయిందని గుర్తించారు. కల్పన్ క్యాబ్ డ్రాపింగ్ లొకేషన్ మాంచెస్టర్ లోని విచ్ వుడ్ ప్రాంతంకాగా.. ఉబర్ యాప్ లో లొకేషన్ ఏకంగా వేల కిలోమీటర్ల దూరంలో ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగరంలో ఉన్న విచ్ వుడ్ పార్క్ గా చూపించింది.
  • అంటే  కల్పన్ క్యాబ్ లో ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ నుంచి ఆస్ట్రేలియాలోని విక్టోరియాకు ప్రయాణించినట్టు చూపి.. రూ.32 లక్షలకుపైగా బిల్లు వేశారన్న మాట.
  • ‘‘ఇంకా నయం. నా కార్డులో అంత డబ్బు లేదు కాబట్టి బతికిపోయా. లేకుంటే వాళ్లు బిల్లు కట్ చేసుకుని ఉంటే.. రీఫండ్ కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది” అని ఓలివర్ కల్పన్ పేర్కొనడం గమనార్హం.
Uber
UK
Australia
Uber ride
Offbeat
International

More Telugu News