Joe Biden: పుతిన్ జోక్ చేయడం లేదు.. కోల్డ్ వార్ తర్వాత మనం మరోసారి అణు యుద్దం ముంగిట ఉన్నాం: బైడెన్

Putin Not Joking About Using Nuclear Weapons In Ukraine says Biden
షార్ట్స్‌లో చూడండి
కోల్డ్ వార్ తర్వాత ప్రపంచం తొలిసారిగా అణు యుద్దం ప్రమాదం ముంగిట నిలిచిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. కెన్నెడీ - క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత మనం అలాంటిదాన్ని మళ్లీ ఎదుర్కోలేదని చెప్పారు. న్యూయార్క్ లో తమ డెమొక్రాటిక్ పార్టీ ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

1962లో ఈ క్యూబా మిస్సైల్ క్రైసిస్ చోటుచేసుకుంది. అప్పట్లో అమెరికా, సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్) మధ్య కోల్డ్ వార్ నడిచేది. క్యూబా భూభాగంలో అప్పటి సోవియట్ యూనియన్ మిస్సైళ్లను మోహరించింది. అమెరికాపై దాడి చేసేందుకు క్యూబా అతి దగ్గరి ప్రదేశం కావడంతో సోవియట్ యూనియన్ ఆ పని చేసింది. అప్పట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.

ఉక్రెయిన్ ను దారిలోకి తెచ్చేందుకు అవసరమైతే అణ్వాయుధాలను కూడా వాడతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారని... ఈ వ్యాఖ్యలు జోక్ కాదని, ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక అని బైడెన్ అన్నారు. క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ తర్వాత ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పారు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం మరింత దిగజారితే... మనందరం అణు యుద్ధం ముంగిట ఉన్నట్టేనని చెప్పారు. 

ఉక్రెయిన్ విషయంలో తమకు ఇక ఏ ఆప్షన్ లేదు అనే పరిస్థితుల్లో అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పుతిన్ హెచ్చరించారు. అయితే... ఈ దాడులు చిన్నగా, వ్యూహాత్మకంగా ఉండొచ్చని యుద్ధ నిపుణులు, విశ్లేషకులు చెపుతున్నారు. అయితే, బైడెన్ మాత్రం ఈ మాటలను తేలికగా తీసుకోవడం లేదు. పుతిన్ గురించి తనకు పూర్తిగా తెలుసని... ఆయన జోక్ చేయడం లేదని అన్నారు. ఒక చిన్న ప్రాంతంపై వ్యూహాత్మకంగా చేసే చిన్న అణు, జీవ, రసాయన ఆయుధాల దాడి... ఆ తర్వాత విస్తృత స్థాయికి చేరుకుంటుందని, దావానలంలా వ్యాపిస్తుందని చెప్పారు. ఒకసారి ఈ తరహా యుద్ధం ప్రారంభమైతే... అది ఆగదని అన్నారు. దీనికి పుతిన్ ఎక్కడ ముగింపు పలుకుతారో అర్థం కావడం లేదని చెప్పారు.
Go Back to Shorts
Joe Biden
USA
Vladimir Putin
Russia
UK
Nuclear Weapons

More Telugu News