wipro: ఉద్యోగుల ‘మూన్​ లైటింగ్​’పై తీవ్రంగా స్పందించిన విప్రో బాస్​ రిషద్​ ప్రేమ్​జీ

There is no space for someone to work for Wipro and competitor  says Rishad Premji
  • ఒకేసారి రెండు కంపెనీల్లో పని చేయడం ‘మూన్ లైటింగ్’
  • దీన్ని ‘మోసం’ అని అన్న రిషద్ 
  • తమ కంపెనీలో అనుమతించేది లేదని స్పష్టీకరణ
తమ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇతర పోటీదారు సంస్థల్లో పని చేస్తున్న 300 మంది తమ ఉద్యోగులను తొలగించి విప్రో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఇలా రెండు కంపెనీల్లో పని చేయడానికి ‘మూన్ లైటింగ్’ అంటారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదని విప్రో చైర్మన్ రిష‌ద్ ప్రేమ్‌జీ స్పష్టం చేశారు. 

ఓ కంపెనీలో తమ పని వేళలు ముగిసిన తర్వాత ఖాళీ సమయంలో ఇతర ఉద్యోగాలు చేయడంపై చర్చ జరుగుతున్నప్పటికీ విప్రో చర్యకు గ్లోబల్ టెక్ కంపెనీ ఐబీఎం కూడా మద్దతు తెలిపింది. మూన్ లైటింగ్ ను అనైతికం అని పేర్కొంది. 300 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత రిషద్.. మూన్ లైటింగ్ గురించి మాట్లాడారు. దీన్ని ఆయన ‘మోసం’ అని అభివర్ణించారు. బుధవారం జరిగిన ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని నొక్కి చెప్పారు.

‘వాస్తవమేమిటంటే, ఈ రోజు విప్రో ఉద్యోగుల్లో కొందరు నేరుగా మా పోటీదారుల్లో ఒకరి కోసం పని చేసే వ్యక్తులు ఉన్నారు.  గత కొన్ని నెలల్లో సరిగ్గా 300 మంది వ్యక్తులను  మేం గుర్తించాం’ అని తెలిపారు. ‘సమగ్రత ఉల్లంఘన’ కారణంగా వారిని సంస్థ నుంచి తొలగించినట్టు ప్రకటించారు. ‘విప్రోలో పని చేసే ఏ ఒక్కరూ మా పోటీదారు సంస్థల్లో పని చేయడానికి వీల్లేదు. ఇతర కంపెనీలు కూడా అదే విధంగా ఆలోచిస్తే.. అలాంటి ఉద్యోగులను గుర్తిస్తాయి’ అని రిషద్ స్పష్టం పేర్కొన్నారు. 

కాగా, ద్వంద్వ ఉద్యోగానికి అనుమతి లేదని ఇన్ఫోసిస్ ఈ నెల ఆరభంలో తమ ఉద్యోగులకు కఠినమైన మెయిల్ పంపింది. ‘నో టూ టైమింగ్స్, నో - మూన్‌లైటింగ్’ అని తమ సిబ్బందికి స్పష్టం చేసింది. ఈ విషయంపై అంతర్గత సంభాషణకు ‘నో డబుల్ లైఫ్’ అని పేరు పెట్టింది.
wipro
moon lighting
wpro chairman
Rishad Premji

More Telugu News