నా హయాంలో 250 మంది హైకోర్టు న్యాయమూర్తులను నియమించగలిగాను: సుప్రీం చీఫ్​ జస్టిస్​ ఎన్వీ రమణ

20-08-2022 Sat 13:58
  • న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమన్న సీజేఐ 
  • ఏపీ అభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపు
  •  ప్రస్తుతం పెండింగ్ కేసుల సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతోందని వెల్లడి 
  • అందరూ కలిసి, కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచన  
I appointed 250 High Court judges during my tenure says CJI NV Ramana
ఏపీలో న్యాయవ్యవస్థకు సహకరిస్తానని సీఎం జగన్‌ మాటిచ్చారని.. తగిన విధంగా సహకరించి నిధులు ఇవ్వడంతో న్యాయస్థానాల నిర్మాణం పూర్తయిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. శనివారం విజయవాడలో న్యాయస్థానాలను ప్రారంభించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడిన తర్వాత తాను తెలుగులో మాట్లాడకపోతే బాగోదంటూ జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులోనే ప్రసంగించారు.

‘‘వక్తలంతా ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రిగారు, నేను తెలుగులో మాట్లాడటానికి ప్రత్యేకత ఉంటుందని భావిస్తున్నాను. పదేళ్ల క్రితం నూతన కోర్టు భవనాలకు నేనే శంకుస్థాపన చేశాను. ఇప్పుడు వాటిని నేనే ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. 11 మే 2013లో ఈ భవనాలకు శంకుస్థాపన జరిగింది. 

ఇక రాష్ట్ర విభజన సమస్యలు, రాష్ట్ర విభజన, ఆర్థిక సమస్యలు, ప్రభుత్వాలు సరిగా నిధులు ఇవ్వకపోవడం వంటి అంశాలతో ఈ భవనాల నిర్మాణం ఆలస్యమైంది. జాప్యం వల్ల లాయర్లు, జడ్జీలు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వాలను, అధికారులను గట్టిగా ప్రశ్నించి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాను. ఇప్పటికి ఈ కాంప్లెక్స్‌ పూర్తికావడం సంతోషదాయకం. పూర్తయిన భవనాలను సక్రమంగా వినియోగించుకోవాలి. ప్రజలందరికీ సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉంది” అని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.

జడ్జీల నియామకాలపై ఒత్తిడి తెచ్చాను
‘‘సత్వర న్యాయం అందించేందుకు దేశవ్యాప్తంగా కోర్టులకు భవనాలతోపాటు న్యాయవ్యవస్థలో జడ్జీల ఖాళీలను భర్తీ చేయాలన్న అంశంపై నేను మాట్లాడటం జరిగింది. ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంల సమక్షంలో ఈ సూచనలు చేశాను. భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలని కోరాను. దీనిపై కేంద్రం నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా.. బెంగాల్, ఏపీ, తమిళనాడు సీఎంలు మాకు మద్దతుగా నిలిచారు. దీనికి కృతజ్ఞతలు తెలియజెప్తున్నాను..” అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

త్వరగా న్యాయం అందించాలన్న తపన ఉండాలి
‘‘దేశంలో ప్రస్తుతం పెండింగ్ కేసుల సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. ప్రజలకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలన్న తపన న్యాయమూర్తులకు ఉండాలి. అలా జరిగినప్పుడే న్యాయవ్యవస్థ మనగలుగుతుంది. న్యాయవ్యవస్థ కుప్పకూలిపోతే, దానిపై ప్రజలకు విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. న్యాయవ్యవస్థను పటిష్ఠ పరిచే కార్యక్రమాల్లో న్యాయవాదుల భాగస్వామ్యం తప్పనిసరి. సమాజంలో మార్పు కోసం వారు కృషి చేయాలి. సీనియర్‌ న్యాయవాదులు జూనియర్లకు తగిన ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది..” అని సీజే జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు.

నా అభివృద్ధికి సహకరించినవారికి కృతజ్ఞతలు
‘‘చాలా మంది గొప్ప మనసుతో నన్ను ఆదరించి పైకి తీసుకువచ్చారు. ఈ నెల 27న పదవీ విరమణ చేయబోతున్నా. నా ఉన్నతికి, విజయానికి కారణమైన న్యాయవాదులు, జడ్జీలకు, నా అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. నా ఎదుగుదలకు మీరే కారణం’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు.

ఐకమత్యంగా ఉండి, అభివృద్ధి చేసుకోవాలి
సమాజం శాంతియుతంగా, ఐకమత్యంతో, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటే అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం విభజన అయ్యాక ఆర్థికంగా, అభివృద్ధి పరంగా వెనుకబడినట్టుగా ప్రజల్లో అసంతృప్తి ఉంది. అది కొంత వరకు వాస్తవం కూడా. అందరూ కలిసి, కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి ఆర్థికంగా సహకరించాల్సి ఉందని భావిస్తున్నాను’’ అన్నారు.

 అన్ని వర్గాల వారికి అవకాశం అందేలా చూశాను..
‘‘ఇప్పటివరకు నాకు ఉన్న అధికారం, అవకాశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో హైకోర్టు న్యాయమూర్తులను నియమించగలిగాను. నేను సుప్రీం చీఫ్ జస్టిస్ గా ఉన్న ఈ ఏడాది నాలుగు నెలల కాలంలో 250 మంది హైకోర్టు న్యాయమూర్తులను, 11 మంది సుప్రీంకోర్టు జడ్జీలను, 15 మంది హైకోర్టు చీఫ్ జస్టిస్ లను నియమించగలిగాను. అన్ని వర్గాల వారికి అవకాశం అందేలా చూశాను.’’

సీఎం జగన్ సహకరించారు..
‘‘రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సహకరిస్తానని సీఎం జగన్‌ అన్నారు. ఆయన సహకరించి నిధులు ఇవ్వడంతో న్యాయస్థానాల సముదాయం పూర్తయింది. విశాఖపట్నంలో కూడా చిన్న సమస్య ఉంది. అక్కడ కూడా భవనాల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. నిధులిచ్చి ఆ భవన నిర్మాణాల పూర్తికి సీఎం జగన్ సహకరిస్తారని ఆశిస్తున్నాను..’’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు.