తెలుగు సినిమా చూసి.. మోక్షం కోసం నిప్పంటించుకున్న యువకుడు!

13-08-2022 Sat 06:31
  • కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఘటన
  • ఆత్మహత్య చేసుకుంటే మోక్షం లభించి పునర్జన్మ ఉండదని నమ్మిన యువకుడు
  • పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న వైనం
  • చికిత్స పొందుతూ మరణించిన యువకుడు
Influenced by the Telugu movie young man set himself on fire for salvation
ఓ తెలుగు సినిమా చూసి ప్రభావితుడైన ఓ యువకుడు మోక్షం లభిస్తుందన్న మూఢ విశ్వాసంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి సమీపంలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఓ గ్రామానికి చెందిన రేణుకా ప్రసాద్ (23) ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. ఖాళీగానే ఉంటున్న యువకుడిని ఏదైనా పని చూసుకోవాలని తల్లిదండ్రులు పదేపదే చెప్పినా వినిపించుకోలేదు.

ఇదిలా ఉండగా, చాలా సంవత్సరాల క్రితం విడుదలైన ఓ తెలుగు సినిమాను రేణుకా ప్రసాద్ ఇటీవల పలుమార్లు చూశాడు. ఆ సినిమా ప్రభావంతో ఆత్మహత్య చేసుకుని మోక్షం పొందాలని నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటే మోక్షం లభిస్తుందని, పునర్జన్మ కూడా ఉండదని యువకుడు విశ్వసించేవాడని స్థానికులు తెలిపారు. 

ఈ క్రమంలో గతవారం 20 లీటర్ల పెట్రోలు తీసుకుని గ్రామ శివారులోకి వెళ్లాడు. తాను ప్రాణత్యాగం చేసుకుని మోక్షం పొందుతున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకుని తండ్రికి పంపి నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన రేణుకా ప్రసాద్‌ను స్థానికులు బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మరణించాడు.