పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కు సమన్లు

12-08-2022 Fri 20:54
  • నగ్న ఫొటోషూట్ తో రణవీర్ సంచలనం
  • తీవ్ర విమర్శలపాలైన ఫొటోలు
  • ముంబయిలో రణవీర్ పై ఫిర్యాదు
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
Police summons for Ranveer Singh
బాలీవుడ్ కథానాయకుడు రణవీర్ సింగ్ ఇటీవల నగ్న ఫొటోషూట్ తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ మ్యాగజైన్ కోసం ఆయన దిగంబరంగా ఫొటోలకు పోజులిచ్చారు. దాంతో రణవీర్ సింగ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. జాతీయస్థాయిలో ఇదొక చర్చనీయాంశం అయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా, వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, విచారణకు రావాలంటూ ముంబయి పోలీసులు రణవీర్ సింగ్ కు సమన్లు అందించాలని నిర్ణయించారు. 

ఇవాళ ముంబయిలో రణవీర్ సింగ్ నివాసానికి పోలీసులు వెళ్లగా, ఆయన అందుబాటులో లేడని తెలిసింది. రణవీర్ సింగ్ ఆగస్టు 16న తన నివాసానికి తిరిగొస్తాడని సమాచారం తెలుసుకున్నారు. దాంతో మరోసారి రణవీర్ సింగ్ నివాసానికి వెళ్లి సమన్లు అందించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ నెల 22న చెంబూరు పోలీస్ స్టేషన్ లో రణవీర్ ను విచారించనున్నారు.