BJP: రేపు ఎంపీ, ఎమ్మెల్యేల‌తో బీహార్ సీఎం నితీశ్ కీల‌క భేటీ.. ఎన్డీఏతో తెగ‌దెంపుల కోస‌మేనా?

Bihar CM Nitish Kumar calls key meeting of JDU MPs and MLAs amid talk of split with NDA
షార్ట్స్‌లో చూడండి
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), కేంద్ర ప్ర‌భుత్వంలోని బీజేపీ మధ్య కొన్నాళ్లుగా స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి దూరంగా ఉన్నారు. దాంతో, ఎన్డీఏ నుంచి జేడీయూ చీలిపోతుంద‌న్న ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాలని నితీశ్ కుమార్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలిచినా ఆయన దూరంగా ఉన్నారు. నితీశ్ గైర్హాజరు వెనుక కారణాలపై అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు.

ఇక నితీశ్ కుమార్ కొన్ని నెలలుగా బీజేపీపై గుర్రుగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. నీతి ఆయోగ్ స‌హా జులై 17 నుంచి ఆయ‌న కేంద్రం చేప‌ట్టిన నాలుగు స‌మావేశాల‌కు హాజ‌రుకాలేదు. దాంతో, బీజేపీతో ఆయనకు విభేదాలు తలెత్తాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నెల 11వ తేదీలోపు బీహార్‌లో ఎన్డీఏ ప్ర‌భుత్వం కూలిపోయే అవ‌కాశం ఉంద‌ని, జేడీయూ త‌న మాజీ మిత్రపక్షమైన ఆర్జేజీతో తిరిగి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. 

ఇప్ప‌టికే బీహార్‌లో జేడీయూ-బీజేపీ పొత్తు తెగిపోతోందని ప్ర‌చారం న‌డుస్తోంది. చాలా మంది జేడీయూ ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు విముఖత చూపుతున్నందున, రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవడానికి ఆ పార్టీ.. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల‌తో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని రాజకీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

బీహార్‌లో ఇలాంటి రాజకీయ గందరగోళం మధ్య నితీశ్ కుమార్ మంగళవారం పాట్నాలో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరినీ ఈ సమావేశానికి పిలిచినట్లు తెలుస్తోంది. ఈ భేటీ త‌ర్వాత ఎన్డీఏ నుంచి వైదొలిగే అంశంపై బీహార్ సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌ని అంతా ఆశిస్తున్నారు. 

మ‌రోవైపు బీజేపీతో విభేదాల వార్త‌ల‌ను జేడీయూ జాతీయ అధ్య‌క్షుడు లాలన్ సింగ్ ఖండించారు. మిత్రపక్షమైన బీజేపీతో అంతా బాగానే ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మంగళవారం జరిగే కీలక సమావేశానికి ఆర్జేడీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాట్నాకు తరలిరావాలని కోరారు. కాగా, ఎన్డీయేకు మరో మిత్రపక్షమైన బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చా కూడా మంగ‌ళ‌వారం తమ ఎమ్మెల్యేలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Go Back to Shorts
BJP
BIHAR
Nitish Kumar
NDA
Narendra Modi
Congress
JDU
RJD

More Telugu News